ఫార్మా వద్దు
గిరిజనుల భూముల్లో
కొడంగల్ రూరల్: గిరిజనుల భూముల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటును ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ స్థలాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే ఎవ్వరికీ ఇబ్బంది ఉండదని ఎల్‌హెచ్‌పీఎస్ జాతీయ అధ్యక్షుడు దాస్‌రాంనాయక్ అన్నారు. మంగళవారం పట్టణంలో ఎల్‌హెచ్‌పీఎస్, భరత ముక్తి మోర్చా, జాతీయ ఓబీసీ సంఘాలు, రాష్ట్రీయ ముస్లిం మోర్చా ఆధ్వర్యంలో ‘చలో కొడంగల్ రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ’ అనే కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లగచర్లతోపాటు ఫార్మా బాధిత రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లగచర్ల ఘటన తర్వాత ప్రజలు భయాందోళనకు గురువుతున్నారని తెలిపారు. తండాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ రాజకీయ లబ్ధి కోసం ఎస్టీ రైతులను బలిచేస్తే ఊరుకునేదిలేదన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్ మహిళా అధ్యక్షురాలు శాంతిబాయి, ఓబీసీ మోర్చా నాయకురాలు సంతోష, ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మోహన్‌కుమార్, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్‌నాయక్, రాష్ట్రీయ ముస్లిం మోర్చా ప్రధాన కార్యదర్శి ఫహీమ్, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పాత్లావత్ గటియానాయక్, రాష్ట్ర కార్యదర్శి గోవింద్‌నాయక్, జాతీయ కార్యదర్శి కొర్ర పాండునాయక్, జిల్లా అధ్యక్షుడు సూర్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
పరిశ్రమల ఏర్పాటును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి
రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి
ఎల్‌హెచ్‌పీఎస్ జాతీయ అధ్యక్షుడు దాస్‌రాంనాయక్
Comments
Please login to add a commentAdd a comment