అనంత వనం వ్యర్థాలు ఘనం
చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలతో మనుషులు, మూగజీవాలతో పాటుగా పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. దీని నివారణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. అనంతగిరుల్లో వ్యర్థాలు పేరుకుపోయి పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు.
8లోu
వికారాబాద్: జిల్లా కేంద్రానికి తలమానికమైన అనంతగిరుల్లో యథేచ్ఛగా పర్యావరణ హనన జరుగుతోంది. రకరకాల పక్షిజాతులు, వన్యప్రాణులు, వందల సంఖ్యలో ఔషధ మొక్కలుండే అనంతగిరులు చెత్తా చెదారంతో నిండిపోతున్నాయి. గుట్టపై కొలువున్న అనంత పద్మనాభ స్వామి ఆలయ పరిసరాలతో పాటు గుట్ట పరిసరాల్లో ప్లాస్టిక్, చెత్తాచెదారం కుప్పలు తెప్పలుగా పడవేస్తున్నారు. అక్కడక్కడ పోగైన చెత్త సైతం అటవీ ప్రాంతంలోనే పడేస్తున్నారు. చెత్త, పర్యాటకులు పడేస్తున్న ఇతర వ్యర్థాలు, తినుబండారాల కోసం ఆ ప్రాంతంలో కుక్కలు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. ఇవి దుప్పులను వేటాడుతున్నాయి. దీంతో వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. అటవీశాఖ అధికారులు నిద్రావస్థలో ఉండగా.. దేవాదాయశాఖ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు.
ఔషధ వనం.. కాలుష్యమయం
ఔషధ వనంగా పిలిచే అనంతగిరులు ప్రత్యేకతలకు నిలయం. కోకిల కూతలతో అలరించే వందలాది పక్షి జాతులు, దట్టమైన అటవీ ప్రాంతం నుంచి పొంగిపొర్లే జలపాతాలు అనంతగిరుల సొంతం. వందల మీటర్ల పొడవుగల నేచురల్ ట్రెక్కింగులు.. సుగంధాలను వెదజల్లే వందలాది జాతుల ఔషధ మొక్కలకు అనంతగిరులు పుట్టినిల్లు. ఔషధ వైద్యుల రీసెర్చ్ కేంద్రంగా విరాజిల్లుతుండడం గర్వకారణం. దుప్పి, దున్న, హైనా, కొండ గొర్రెలు లాంటి జాంతుజాతులు అనంతగిరుల సొంతం. జిల్లాలో అటవీ ప్రాంతాన్ని ఐదు క్లస్టర్లుగా.. 94 బ్లాకులుగా విభజించగా ఇందులో అనంతగిరి ప్రాంతంలోని అడవి ప్రధానమైనదిగా చెబుతారు.
అవగాహన కల్పనలో
అధికారులు విఫలం
వికారాబాద్ జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని అనంతగిరి అడవులను ఔషధ వనంగా పిలుస్తారు. ఇక్కడ సహజసిద్ధంగా పెరిగిన 300 రకాల ఔషధ మొక్కలున్నాయి. ఫారెస్టు అధికారులు మరో 18 రకాలకు చెందిన 50 వేల ఔషధ మొక్కలు నాటి పెంచుతున్నారు. అనంతగిరి అడవులు, కొండలు ఔషధ వైద్యులకు రీసెర్చ్ కేంద్రంగా ఉపయోగపడుతుంది. ఔషధ వైద్యులు, విద్యార్థులు ఔషధ మొక్కల పరిశోధనకు ఇక్కడికి వస్తుంటారు. అధికారులు కాలుష్యమయం కాకుండా, చెత్తా చెదారం పడేయకుండా ప్లాస్టిక్, తినుబండారాలు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా అధికారులు పర్యాటకులకు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి.
ప్రకటనల్లోనే ప్లాస్టిక్ నిషేధం
ఇష్టానుసారంగా తినుబండారాలు పడేస్తున్న పర్యాటకులు
వీధికుక్కల స్వైర విహారం
వన్యప్రాణులను వేటాడుతున్ను కుక్కలు
పట్టించుకోని అటవీ, దేవాదాయ శాఖలు
అందరి సహకారం అవసరం
సహజ సిద్ధమైన వాతావరణం కలిగిన అనంతగిరులను కాపాడుకునేందుకు ప్రతీ ఒక్కరి సహకారం అవసరం. సహజసిద్ధంగా ఏర్పడిన వనరులకు ఎలాంటి నష్టం కలగకుండా కొండలు, అడవుల అందాలను మరింత పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. జంతువులు, పక్షుల రక్షణకు నీటి కొలనులు ఏర్పాటు చేశాం. నీటి అవసరాలు తీర్చేందుకు నాలుగు చోట్ల చెక్‌డ్యామ్‌లు నిర్మించాం. ప్లాస్టిక్ వాడకం నిషేధించాం. ప్లాస్టిక్ ఫ్రీజోన్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నాం. ఇందుకు పర్యాటకులు సైతం సహకరించాలి. ప్లాస్టిక్ నిషేధించేందుకు దేవాదాయ శాఖ అధికారులతో కలిసి కృషి చేస్తాం.
– జ్ఞానేశ్వర్, జిల్లా అటవీశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment