ఆయకట్టు బీళ్లు అన్నదాత కన్నీళ్లు!
బషీరాబాద్: జిల్లాలో ఎత్తిపోతల పథకం ఉత్తిగానే మిగిలిపోయింది. కాగ్నా పరివాహక గ్రామాల రైతులకు సాగు నీరు అందించాలన్న సంకల్పంతో కాగ్నాపై ఐదు దశాబ్దాల క్రితం నాటి ప్రభుత్వం నాలుగు ఎత్తిపోతల పథకాలను నిర్మించింది. ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వీటి నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షించేది. ప్రారంభంలో 2 వేల ఎకరాలకు పైగా సాగునీరు పారడంతో పరిసర ప్రాంతాలు పచ్చని పంట పొలాలతో కళకళలాడేవి. ఆయకట్టు రైతులు వరి, వేరుశనగ, ఇతర ఆరుతడి పంటలు వేసేవారు. కానీ ప్రస్తుతం లిఫ్టులు మూతపడటంతో సాగునీరందక పొలాలు బీళ్లుగా మారిపోయాయి. సాగుకు స్వస్తి చెప్పిన ఆయకట్టు రైతులు కూలీ పనులకు వెళ్తున్నారు.
ప్రభుత్వాల నిర్లక్ష్యం
ఎత్తిపోతల పథకాలకు సాగు నీటి సంఘాలు ఉండేవి. అయితే వీటిపై ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన నిర్వహణ వ్యయం భారమై ఐడీసీ చేతులెత్తేసింది.దీంతో జిల్లాలోని జీవన్గీ, ఇందర్‌చెడ్, దోర్నాల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు మూతపడగా, నావంద్గీ ఆదరణకు నోచుకోలేదు. దీని కారణంగా ఏటా సుమారు 6.3 టీఎంసీల వరద నీరు దిగువనున్న కర్ణాటకకు తరలిపోతోంది. వెరసి నాలుగు లిఫ్టుల కింద ఉన్న 2వేల ఎకరాల ఆయకట్టు భూములు నేడు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి.
విద్యుత్ బకాయి రూ.5 లక్షలు
నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల నిర్వహణకు వినియోగించిన కరెంటు బిల్లుల బకాయిలు సుమారు రూ.5లక్షల వరకు పేరుకుపోయిందని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. బిల్లులు కట్టాలని ఐదేళ్లుగా ట్రాన్స్ కో అధికారులు ఐడీసీకి చెప్పినా చెల్లించలేదని, సరఫరాను నిలిపివేశారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం వేసిన శిలాఫలకం
పునరుద్ధరణకు రూ.1.30కోట్లు
బషీరాబాద్ మండల కేంద్రం పక్కనే ఉన్న నావంద్గీ లిఫ్ట్ 2012 వరకు 550 ఎకరాల వరకు సాగునీరు అందించేంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పునరుద్ధరణ కోసం నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.1.30కోట్ల నిధులు మంజూరు చేసింది. అప్పటి మంత్రి హరీశ్‌రావు, మాజీ మంత్రి, ప్రస్తుత చీఫ్‌విప్ మహేందర్‌రెడ్డి 2017 మే 7న శిలాఫలకం వేశారు. పైప్‌లైన్ కోసం అందులో నుంచి రూ.8లక్షలు నిధులతోపంపునుంచి కాలువల వరకు పైప్‌లైన్‌ను కొత్తగా తవ్వారు. కానీ అది కూడా మూతపడింది. దీంతో ఆయకట్టు రైతులు కొందరుబోర్లువేసుకొని సాగు చేసుకుంటుండగా..మరి కొందరు బీళ్లుగానే వదిలిపెట్టారు. కాగా.. జీవన్గీ వద్ద కాగ్నాలో రైతులు మోటార్లు బిగించి ఆరుతడి పంటలు వేస్తున్నారు. దిగువన కర్ణాటక ప్రభుత్వం చెక్‌డ్యాం నిర్మించడంతో బ్యాక్ వాటర్ ద్వారా పంటలు పండిస్తున్నట్లు కర్షకులు చెబుతున్నారు. ఒక వేల 4 లిఫ్టులతో పాటు మరికొన్ని లిఫ్టులు నిర్మిస్తే.. 6.3టీఎంసీల నీటిని 40వేల ఎకరాలకు సాగునీటితో పాటు, తాగడానికి వాడుకునే అవకాశంఉండేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ఎత్తిపోతల కింద ఆయకట్టు ఇలా..
ఎత్తిపోతల పేరు ఆయకట్టు
(ఎకరాల్లో..)
నావంద్గీ 550
ఇందర్‌చెడ్ 600
జీవన్గీ 600
దోర్నాల్ 250
మొత్తం 2,000
వ్యయం వృథా అని మూత
చిన్న, మధ్య, భారీ సాగునీటి ప్రాజెక్టులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2021లో ఒకే గొడుగు కిందకు తెచ్చింది. ఇందులో భాగంగా లిఫ్ట్ ఇరిగేషన్ ఐడీసీ(ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) నుంచి సాగునీటి శాఖకు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆ శాఖ అధికారులు ఎత్తిపోతలపై దృష్టి సారించారు. లిఫ్టులు ఎందుకు మూతపడ్డాయి, కరెంటు బిల్లుల బకాయి, ఆయకట్టు భూముల వివరాల లెక్కలు తీశారు. ఇందులో దోర్నాల, జీవన్గీ, ఇందర్‌చెడ్ పునరుద్ధరణ చేయడం మూడు రెట్లు ఖర్చుతో కూడుకున్నదని, తద్వారా రైతులకు మేలు జరగదని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో మూడు ఎత్తిపోతల పథకాలు శాశ్వతంగా మూతపడనున్నాయి.
1974లో కాగ్నా నదిపై 4 లిఫ్టుల నిర్మాణం
2 వేల ఎకరాలకు సాగు నీరు అందించే సామర్థ్యం
మూతపడిన మూడు ఎత్తిపోతలు
నావంద్గీని మాత్రమే పునరుద్ధరించే అవకాశం
దీన్నికూడా పట్టించుకోని పాలకులు, ఇరిగేషన్ అధికారులు
పూడుకున్న కాలువలు
కాగ్నా నుంచి మొదటి 20 ఏళ్లపాటు ఎత్తిపోతలు బ్రహ్మాండంగా సాగినా.. తరువాత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో కాలువలు, మోటార్లు మరమ్మతులకు గురయ్యాయి. కరెంటు బిల్లుకు మొదటి నుంచి రెండు దశాబ్దాల వరకు ప్రభుత్వాలు నిధులు కేటాయించాయి. దీంతో పాటు ఆయకట్టు రైతుల నీటి పన్నుల ద్వారా కొనసాగుతూ వచ్చింది. అయితే దోర్నాల్, జీవన్గీ, ఇందర్‌చెడ్ లిఫ్ట్ ఇరిగేషన్లు నిర్వహణ భారంతో 20 ఏళ్లుగా మూత పడిపోయాయి. మోటార్లు కాలిపోయాయి. కాలువలు, నదిలో తీసిన బావులు పూడుకు పోయాయి.
పునరుద్ధరించాలి
జీవన్గీ ఎత్తిపోతల పథకం 20 ఏళ్లుగా మూతపడింది. పాలకులు పట్టించుకోవడం లేదు. దీని కింద నాకు 1.24 ఎకరాల సాగు భూమి ఉంది. లిఫ్టు మూతపడటంతో వాగులో మోటారు పెట్టి, పైప్‌ల ద్వారా పంటలు పండిస్తున్నా. ఎత్తిపోథల పథకం పునఃప్రారంభించి సాగునీరు ఇవ్వాలి. లేని పక్షంలో సోలర్ పంపుసెట్లు ఇస్తే ఆరుతడి పంటలు వేస్తాం.
– బసప్ప, రైతు, జీవన్గీ
నావంద్గీ పునరుద్ధరణకు వీలు
జిల్లాలోని నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రస్తుతం పనిచేయడం లేదు. వీటిని ఇరిగేషన్‌కు అప్పగించిన తరువాత పరిశీలిస్తే నిర్వహణకు భారీగా ఖర్చవుతుందని పేర్కొంది. ఇప్పటికే అన్నింటికీ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మూడు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. పరిస్థితులను ప్రభుత్వానికి నివేదించాం. నావంద్గీని పునరుద్ధరణ చేయాలని నివేదించాం. ఈ లిఫ్టు పనులు పూర్తయితే పూర్తిస్థాయిలో సాగునీరు అందించవచ్చు. ప్రస్తుతం జుంటుపల్లి ప్రాజెక్టు పునరుద్ధరణకు రూ.10 కోట్లతో నివేదిక తయారు చేశాం.
– కిష్టయ్య, డీఈఈ
ఐదు దశాబ్దాల క్రితం..
జిల్లాలోని అనంతగిరుల్లో పుట్టిన కాగ్నా నది ధారూరు, పెద్దేముల్, యాలాల, తాండూరు, బషీరాబాద్ మండలాల మీదుగా ప్రవహిస్తూ ఇందర్‌చెడ్ దగ్గర దిగువనున్న కర్ణాటకలో కలుస్తుంది. వర్షాకాలంలో ఎగువన కురిసే భారీ వర్షాలకు నావంద్గీ, ఇందర్‌చెడ్ మధ్యన 6.3 టీఎంసీల భారీ వరద నీరు దిగువనున్న కర్ణాటక మీదుగా కృష్ణానది ఉపనది బీమాలో కలుస్తుంది. కాగ్నా నీటిని వ్యవసాయానికి వాడుకోవడానికి 5 దశాబ్దాల క్రితం 1974లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బషీరాబాద్ మండలంలో జీవన్గీ, నావంద్గీ, ఇందర్‌చెడ్, ధారూరు మండలం ధోర్నాల్ దగ్గర నాలుగు ప్రధాన లిఫ్టులను నిర్మించింది. వీటా ద్వారా పరివాహక పరిధి బీడు భూములకు సాగునీరుతో పాటు తాగునీరు ఇవ్వాలని సంకల్పించి ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment