చట్టాలు అతిక్రమిస్తే చర్యలు
ఎస్పీ నారాయణరెడ్డి
దౌల్తాబాద్: ‘చట్టాలు అతిక్రమించిన వారు ఎంతటి వారైనా.. ఉపేక్షించేంది లేదు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం ఆయన మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రవిగౌడ్ పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. పోలీసులు గౌరవవందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన.. రికార్డులు పరిశీలించారు. పూర్వ కేసుల స్థితిగతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టంచేశారు. ఠాణాకు వచ్చే ఫిర్యాదుదారుడితో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. మండలంలో క్రైం రేటు చాలా తక్కువగా ఉందని సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తంచేశారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శ్రీధర్‌రెడ్డి, ఎస్‌ఐ రవిగౌడ్ తదితరులున్నారు.
భూ నిర్వాసితులకు
ప్లాట్ల పంపిణీ
కొడంగల్ రూరల్: మెడికల్, వెటర్నరీ కళాశాలల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా శనివారం తహసీల్దార్ విజయ్‌కుమార్, సబ్ రిజిస్ట్రార్ రవికాంత్ అప్పాయిపల్లి గ్రామ రైతులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. డీటీసీపీ లేఅవుట్ ద్వారా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి, రైతులకు అందజేస్తున్నారు.
సార్.. నిధులివ్వండి
పరిగి: నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్, పలు డబుల్ రోడ్ల నిర్మాణం గురించి ప్రస్తావిస్తూ.. ఎక్కడెక్కడ ఎన్ని నిధులు కావాలో రేవంత్‌కు వివరించారు. దీనికి సీఎం.. సానుకూలంగా స్పందించారని టీఆర్‌ఆర్ పేర్కొన్నారు.
సీఎం కప్ రాష్ట్ర స్థాయి
కబడ్డీ పోటీలకు ఎంపిక
తాండూరు రూరల్: మండల పరిధిలోని జినుగుర్తి గేటు వద్ద ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థి పుష్పలత రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపికై ంది. రెండు రోజులుగా కొడంగల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో సత్తాచాటిన ఆమెను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 2వరకు మహబూబ్‌నగర్‌లో నిర్వహించే పోటీల్లో పుష్పలత జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. ప్రిన్సిపల్ శ్రీదేవి, పీఈటీ యాదగిరి, అధ్యాపకులు, తోటి విద్యార్థులు ఆమెను అభినందించారు.
మున్సిపాలిటీ ఏర్పాటు వద్దు
మొయినాబాద్: మండలంలోని గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీగా ఏర్పాటు చేయొద్దని చిలుకూరు గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు చిలుకూరు బాలాజీ దేవాలయం ఎదుట శనివారం ‘మున్సిపాలిటీ వద్దు.. గ్రామ పంచాయతే ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. స్వామివారు పాలకుల బుద్ధి మార్చి గ్రామ పంచాయతీలుగానే ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పురాణం వీరభద్రస్వామి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలను మున్సిపాలిటీలుగా చేయడం ద్వారా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment