పెరిగిన నేరాలు
గత ఏడాదితో పోలిస్తే ఈసారి క్రైంరేట్ అధికం ● సివిల్ తగాదాల్లో పోలీసుల జోక్యం ● లగచర్ల ఘటనతో ఉలిక్కిపడిన జిల్లా ● దేశవ్యాప్తంగా సంచలనం ● పెరిగిన రోడ్డు ప్రమాదాలు.. అదే స్థాయిలో మృతులు
వికారాబాద్: గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరంలో నేరాలు బాగా పెరిగాయి. నిఘా వ్యవస్థల వైఫల్యం కూడా నేరాలు పెరగడానికి కారణమని తెలుస్తోంది. ఆత్మహత్యలు, ప్రమాదాల హాట్‌స్పాట్ల గుర్తింపు, త్వరితగతిన స్పందించడంతో కొన్ని రకాల నేరాలు తగ్గాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల సివిల్ తగాదాల్లో పోలీసులు తలదూర్చారన్న ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా చన్గొముల్, వికారాబాద్, నవాబుపేట, మోమిన్‌పేట, తాండూరు, ధారూరు, పరిగి పోలీస్ స్టేషన్ల పరిధిలో సివిల్ మ్యాటర్స్‌లో పోలీసుల జోక్యంపై విమర్శలు వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, మిస్సింగులు, ప్రమాదాలు పెరగడం పోలీసులకు సవాలుగా మారింది. గుట్కా, గంజాయి విక్రయాలు, ఇసుక, కలప అక్రమ రవాణా, రేషన్ బియ్యం అక్రమ రవాణాను కట్టడి చేయలేకపోయారనే అపవాదు మూటగట్టుకున్నారు. ఈ ఏడాది సీసీ టీవీల ఏర్పాటులోనూ పోలీసులు వెనకబడ్డారనే చెప్పవచ్చు. ప్రమాదాలు, మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
లగచర్ల ఘటనతో..
కొడంగల్ నియోజకవర్గం దుద్యాల్ మండలం లగచర్ల ఘటనతో జిల్లా ఉలిక్కి పడింది. ఈ ఏడాది నవంబర్ 11న లగచర్ల గ్రామంలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, కడా ప్రత్యేక అధికారి, డీఎస్పీ సహా ఇతర అధికారులపై జరిగిన దాడి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో అడిషనల్ కలెక్టర్‌కు స్వల్ప గాయాలు కాగా.. కడా ప్రత్యేక అధికారి, డీఎస్పీ తీవ్రంగా గాయపడ్డారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి తోపాటు 26 మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 110 మంది వరకు దాడిలో పాల్గొన్నట్టు ప్రాథమిక విచారణలో తేల్చిన పోలీసులు 42 మంది పేర్లను రిమాండ్ రిపోర్టులో పొందుపర్చారు. అయితే భూములు ఇవ్వమన్నందుకు రైతులను అరెస్టు చేసి జైలుకు పంపారని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశాయి. దీంతో ప్రభుత్వం వెనక్కు తగ్గి ఫార్మాసిటీ స్థానంలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
భూ వివాదాల్లో ఖాకీల జోక్యం
ఇటీవలి కాలంలో చాలా వరకు ఫిర్యాదులు ఎఫ్‌ఐఆర్ నమోదు కాకుండానే బుట్టదాఖలవుతున్నాయి. పోలీస్ స్టేషన్లలో నేతల ప్రభావం పెరిగి పోవడంతో.. వారి ఒత్తిళ్లకు తలొగ్గి వచ్చిన ఫిర్యాదుల్లో చాలా వరకు పక్కన పడేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చన్గొముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూ కబ్జాదారులకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని ఓ వ్యక్తి గన్నుతో బెదిరిస్తే పోలీసులు నేరస్తులకే సపోర్టు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఇందులో ఎస్‌ఐ ప్రమేయం ఉందనే ఆరోపణలు రాగా.. చివరకు ఓ హెడ్ కానిస్టేబుల్, హోంగార్డుపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.
ఇసుక మాఫియాతో కుమ్మక్కు !
తాండూరు సబ్ డివిజన్ పోలీసులు ఇసుక మాఫియాతో కుమ్మక్కవడం ఆ శాఖలో చర్చనీయాంశం అయ్యింది. ఇసుక మాఫియాతో అంటకాగుతున్న ముగ్గురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు. తాండూరు సబ్ డివిజన్‌లో పోలీసులు ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment