నూతన వేడుకలు శ్రుతిమించొద్దు
వికారాబాద్: కాలచక్రం గిర్రున తిరిగింది. అప్పుడే మరో ఏడాది గడిచిపోయింది. 2024 సంవత్సరం నేటితో ముగియనుంది. కొత్త సంవత్సరం 2025 రానే వచ్చింది. న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించేందుకు యువతీ యువకులు, ప్రజలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అధికారులు, పోలీసులు ఓ పక్క జాగ్రత్తలు సూచిస్తూనే బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకల నిర్వహణ ఎలా ఉండాలి.. ఎలాంటి నిబంధనలు పాటించాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలపై ఎస్పీ నారాయణరెడ్డి సోమవారం సాక్షికి వివరించారు.
సాక్షి : న్యూ ఇయర్ వేడుకలకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..?
ఎస్పీ నారాయణరెడ్డి: నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ, అశ్లీల సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యేక కార్యక్రమాలు చేయాలనుకుంటే ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. డీజేలు, ప్రజలకు ఇబ్బంది కలింగిచే కార్యక్రమాలకు అను మతి లేదు. నేటి(మంగళవారం) రాత్రి 8గంటల నుంచి జిల్లా వ్యాప్తంగా పోలీసు గస్తీ ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం.
సాక్షి: వేడుకల నేపథ్యంలో ప్రజలకు మీరిచ్చే సూచనలు ఏమిటి?
ఎస్పీ: వేడుకల్లో స్వీయ నియంత్రణ అనేది సామాజిక బాధ్యత. శాంతిభద్రతల పరిరక్షణలో అందరి భాగస్వామ్యం అవసరం. ప్రజల సంక్షేమం కోసమే నిబంధనలు, చట్టాలు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మన ఆనందం కోసం ఇతరును ఇబ్బంది పెట్టేలా వ్యవహరించరాదు. తోటి వారికి ఇబ్బంది కలిగించినా.. అవాంఛనీయ ఘటనలకు పాల్పిడినా ఉపేక్షించం. వేడుకలు శ్రుతిమించితే డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలి.
సాక్షి : ప్రధానంగా యువతకు ఏం చెబుతారు?
ఎస్పీ: శాంతిభద్రతలకు భంగం కలగకుండా పోలీసులు చేపట్టే చర్యలకు యువత సహకరించాలి. కట్టుదిట్టమైన ఆంక్షలేమి లేనప్పటికీ ఆర్భాటాలకు దూరంగా ఉండటం మంచిది. సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా పెట్టాం. వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. అర్ధరాత్రి రోడ్లపై గుంపులుగా తిరగరాదు.
సాక్షి : తల్లిదండ్రులు ఏం చేయాలి..?
ఎస్పీ : ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల కదలికలపై దృష్టి పెట్టాలి. ఏదైనా జరగకూడనిది జరిగాక బాధపడి ప్రయోజనం ఉండదు. ఈ విషయాన్ని గుర్తించాలి. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటాం. పోలీసుల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్డు ప్రమాదాలపై తల్లిదండ్రులు పిల్లలకు సూచనలు చేయాలి. వాటి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలి. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆనందంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి.
సాక్షి : రిసార్ట్స్, ఈవెంట్స్ నిర్వాహకులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు?
ఎస్పీ : ఇప్పటికే రిసార్ట్స్ నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. అసాంఘిక కార్యకలాపాను ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించం. పోలీసు నిబంధనలు కచ్చితంగా పాటించాలి.. వేడుకలు అదుపుతప్పితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలి..
సాక్షి : ఆకతాయిల చేష్టలపై ఎలా వ్యవహరిస్తారు?
ఎస్పీ : పోలీసులు తమ సంతోషాలను, కుటుంబాలతో గడిపే సందర్భాలను త్యాగం చేసి ప్రజలకోసమే పని చేస్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ సహకరించాలి. అలాగే జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..
నిబంధనలకు లోబడే సంబరాలు జరుపుకోవాలి
మన ఆనందం మరొకరికి ఇబ్బంది కారాదు
బహిరంగ ప్రదేశాల్లో మద్యం నిషేధం
ప్రత్యేక బృందాలతో గస్తీ ఉంటుంది
పిల్లల కదలికలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి
న్యూ ఇయర్ వేడుకలపై ‘సాక్షి’తో ఎస్పీ నారాయణరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment