అమాయకులే టార్గెట్
షాద్‌నగర్ రూరల్: అమాయకులు, మహిళలను టార్గెట్‌గా చేస్తారు.. ఏటీఎంలలో డబ్బులు తీయడం రాని వారిని పరిచయం చేసుకుంటారు.. డబ్బులు తీసిస్తామని దృష్టిమరల్చి ఏటీఎం కార్డు మార్చేసి డూప్లికేట్ కార్డు ఇస్తారు. ఒరిజినల్ కార్డుతో డబ్బులు డ్రా చేసుకుంటారు. ఇటీవల ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాలోని ముగ్గురు సభ్యులను బుధవారం షాద్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను పట్టణ సీఐ విజయ్‌కుమార్ విలేకరులకు వెల్లడించారు.
ఉపాధి కోసం వచ్చి
బీహార్ రాష్ట్రం ఈస్ట్ చంపారన్, సోనబర్సా గ్రామానికి చెందిన కరిమన్‌సహాని, రూప్‌దేవ్‌సహాని, పంజాబ్ రాష్ట్రం కపుర్తల పగ్వారా గ్రామానికి చెందిన సహీబ్‌సహాని కొన్నేళ్ల క్రితం ఉపాధికోసం వచ్చారు. కూలీ పనులు చేస్తూ శంషాబాద్ మండలం తొండుపల్లిలో నివాసం ఉంటున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే పథకం వేసి ఏటీఎంల వద్ద మోసాలకు పాల్పడుతున్నారు.
జడ్చర్లలో కేసుతో ఆటకట్టు..
నందిగామ మండలం, శ్రీనివాసులగూడెంకు చెంది న కుమ్మరి రాజు 2024 ఆగస్టు 5న జడ్చర్ల రోడ్డులోని ఐడీబీఎం ఏటీఎంకు వెళ్లాడు. ఈయనకు డబ్బులు తీయడం రాదని గ్రహించిన దుండగులు, అతని వద్దకు వెళ్లి కార్డు మార్చేశారు. కొంతసేపటి తర్వాత తన ఖాతా నుంచి డబ్బులు డ్రా అయినట్లు గుర్తించిన రాజు అదేరోజు షాద్‌నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి సాంకేతిక పరిజ్ఞానంతో ముఠా సభ్యులను పట్టుకున్నారు.
15 సార్లు చోరీలు
ఏటీఎం కార్డులు దోపిడీకి పాల్పడుతున్న దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులు విచారించగా ఏటీఎంల వద్ద నేరాలకు పాల్పడినట్లు అంగీకరించారు. షాద్‌నగర్, ఆర్‌జీఐఏ, పటాన్‌చెరు, శంషాబాద్‌లో రెండేసి చొప్పున, దుండిగల్, సనత్‌నగర్, జడ్చర్ల, గచ్చిబౌలి, జీడిమెట్ల, మైలార్‌దేవ్‌పల్లి, బాలా నగర్ ఏటీఎంల వద్ద ఒక్కోటి చొప్పున మొత్తం 15 దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి రూ.2,38,140 నగదు, డూప్లికే ట్ ఏటీఎం కార్డులు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ డీసీపీ రాజేశ్, అడిషనల్ డీసీపీ రాంకుమార్, సైబారాబాద్ ఎస్‌ఓటీ డీసీపీ శోభన్‌బాబు, సీఐ సంజయ్, షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి పర్యవేక్షణలో పట్టణ సీఐ విజయ్‌కుమార్, విచారణాధికారి డీఐ వెంకటేశ్వర్లు, డీఎస్‌ఐ శరత్‌కుమార్, క్రైం టీం మోహన్, కరుణాకర్, జాకీర్, రాజు, రఫీ కేసును ఛేదించారు.
ఏటీఎం కార్డులతో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా
డబ్బులు డ్రా చేసి ఇస్తామని దోపిడీలు
ముగ్గురు దుండగులకు రిమాండ్
రూ.2,38,140 నగదు, డూప్లికేట్ ఏటీఎం కార్డులు స్వాధీనం
వివరాలు వెల్లడించిన షాద్‌నగర్ సీఐ విజయ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment