ఓ అందమైన బావా.. వహ్‌వా
ఆవు పాలకోవా.. వారేవా
విందుగా పసందుగా.. ప్రేమనందుకోవా
విందుగా పసందుగా
ప్రేమనందుకోవా... కోవా
ఓ హాటు హాటు గారె.. వెరీ వెరీ సారీ
స్వీటు స్వీటు బూరె. వై వై హర్రీ
ఓ హాటు హాటు గారె.. వెరీ వెరీ సారీ
వలపుతలపు కలపి వండినానోయ్.. అమ్మోయ్
రాగాల రవ్వట్టు భోగాల బొబ్బట్టు
అంటూ తమ బావను ఆటపట్టించే మరదళ్లు
వీరి సరసాలకు మురిసిపోయే అల్లుళ్లు.. ఇవన్నీ దసరా సరదాలు.. జీవితంలో మధుర స్మృతులు. కూతురు, అల్లుడు ఇంటికి వస్తేనే అసలైన పండగ. పెళ్లయిన కొత్త దంపతులు దసరా సందర్భంగా విశాఖ వచ్చి.. కొందరు విశాఖ నుంచి అత్తారింటికి వెళ్లారు. ఇలా అల్లుళ్ల ముచ్చట్లపై కథనం..
ఆటవిడుపు
రోజంతా బిజీగా ఉండే మాకు దసరా సెలవులు ఊరటనిచ్చాయి. సెలవుల్లో అత్తవారింటికీ వచ్చి అందరితో కలిసి సరదగా గడుపుతున్నాం. మా పిల్లలు తోటి పిల్లలతో సరదాగా ఆడుకుంటున్నారు. ఇలాంటి అవకాశం దసరా, సంక్రాంతి పండగల్లో మాత్రమే వస్తుంది. దసరా సెలవులు మాలాంటి వారికి ఆటవిడుపులాంటివి..
– శ్రీలక్ష్మి గంగాధర్, సీతమ్మధార
ఆ మర్యాదలే వేరు..
చిన్నప్పటి నుంచి చదువు, ఉద్యోగం. ఇవే తప్ప రిలేషన్స్‌పై పెద్దగా అవగాహన ఉండేది కాదు. పెళ్లయిన తరువాత బంధాలు.. అనుబంధాలపై నమ్మకం, అవగాహన ఏర్పడింది. పైళ్లెన తరువాత తొలి దసరాకు నక్కపల్లి వచ్చాం. అత్తవారింట్లో మర్యాదలు మామూలుగా ఉండడం లేదు. నా భార్య అనురాధ బంధువుల కొత్త పలకరింపులు, సరదాలు.. ముచ్చట్లు భలే అనిపిస్తున్నాయి.
– రామ్, విశాఖపట్నం
చాలా సంతోషంగా ఉంది
రెండు నెలల క్రితం పెళ్లయింది. దసరా పండగకు అత్తారిళ్లు అడివరం వచ్చా. వాళ్లు చూపిస్తున్న ప్రేమ, మర్యాదలకు ఫిదా అయ్యా. మూడు రోజుల నుంచి ఘుమఘులాడే పిండివంటలు చేసి పెడుతున్నారు. చాలా మొహమాటంగా ఉంది. పెళ్లయిన తరువాత తొలి దసరా చాలా సంతోషాన్ని పంచింది.
– మౌళి కుమార్, పెదగదిలి
భలే ఎంజాయ్ చేస్తున్నా..
మేం ఉండేది కేవలం రోజులైనా మా కోసం పలురకాల వంటలు చేశారు. అత్తారింట్లో ఆ మర్యాదలే వేరు. వారి ప్రేమ వారిది. ఫ్యామిలీ మొత్తం సరదాగా గడుపుతున్నాం. సినిమాలకు వెళ్లడం.. బీచ్‌లో సేదతీరడం భలే మజాగా ఉంటుంది. అత్తమామలు చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే బంధాలు, అనుబంధాలపై విలువ తెలుస్తోంది. మరదళ్లు ఆటపట్టిస్తూ చేస్తున్న అల్లరి మార్చిపోలేను.
– సంపత్, నక్కవానిపాలెం
Comments
Please login to add a commentAdd a comment