నెయ్యి దీపాలతో కృష్ణుడికి ఆరాధన
తగరపువలస: కార్తీకమాసంలో కృష్ణుడిని నెయ్యి దీపంతో ఆరాధించడం అత్యంత ముఖ్యమైనదని డాక్టర్ నిష్క్రించిన భక్తదాస అన్నారు. గంభీరం ఐఐఎంవీ రోడ్డులోని హరేకృష్ణ వైకుంఠం వద్ద హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో బుధవారం లక్ష దీపోత్సవం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆయన కార్తీక వ్రత ఆవశ్యకత గురించి వివరించారు. బహుమానాల్లో కృష్ణుడికి నెయ్యి దీపం మంచిదన్నారు. దీనికి సమానమైన బహుమానం మరొకటి లేదన్నారు. ఎవరైతే శ్రీహరి ఆలయంలో కార్తీకమాసంలో కొద్దిసేపైనా దీపారాధన చేస్తారో.. వారు అనేక కల్పముల పాప ఫలితముల నుంచి విముక్తి పొందుతారన్నారు. భక్తులంతా భగవంతుడి సంతృప్తి, శాశ్వత శ్రేయస్సు ఆశించి ఈ వ్రతాన్ని ఆచరించవచ్చన్నారు. ఈ వ్రతం ఆచరించేవారు ప్రతిరోజూ కృష్ణ ఆలయాన్ని సందర్శించాలన్నారు. ఇదే నెలలో గోవర్ధన పూజ, రాసలీల, దీపావళి మొదలైన ప్రాశస్త్యమైన శ్రీకృష్ణలీలలు జరిగాయన్నారు. ఐదు రోజుల పాటు ప్రతిరోజూ నెయ్యి దీపారాధనతో పాటు ఆత్మను హత్తుకునే రీతిలో సంగీత వాయిద్యాలతో దామోదరష్టకం భజన కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా హనుమంతరావు గ్రూప్ కూచిపూడి అకాడమీ కళాకారుల ప్రదర్శన అద్భుతంగా సాగింది. అనంతరం భక్తుల సమక్షంలో ఆకాశదీప ఆవిష్కరణ, సామూహిక దామోదర అష్టకం, తులసిపూజ, నెయ్యిదీపాలతో హారతి అందించారు.
Comments
Please login to add a commentAdd a comment