మాట్లాడుతున్న కలెక్టర్ నాగలక్ష్మి
విజయనగరం అర్బన్:
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు తక్షణమే భూమిని కేటాయించాలని ఏపీఐఐసీ అధికారులకు కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం జరిగిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశంలో జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన ప్రతిపాదనలు, ప్రభుత్వ శాఖల ద్వారా వాటి ఏర్పాటుకు ఇచ్చిన అనుమతులపై సమీక్షించారు. పరిశ్రమలకు అవసరమైన భూమి కేటాయింపునకు రెవెన్యూ అధికారులతో పరిశ్రమల శాఖ అధికారులు స్వయంగా మాట్లాడాలన్నారు. క్లస్టర్ అభివృద్ధి పథకంలో పరిశ్రమల ఏర్పాటుకోసం భూముల గుర్తింపు త్వరగా పూర్తిచేయాలన్నారు. పరిశ్రమలు, వాణిజ్య సంస్థల్లో నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం భద్రత చర్యలు ఉన్నదీ లేనిదీ తనిఖీ చేయాలని ఆదేశించారు. పరిశ్రమల శాఖ, ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు ద్వారా పీఎంఈజీపీ పథకంలో ప్రభుత్వం కేటాయించిన మేరకు యూనిట్లు ఏర్పాటు కావాలన్నారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకోసం సింగిల్ డెస్క్ విధానంలో ఈ ఏడాది మే 25 నుంచి 26 జూలై వరకు 125 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 108 దరఖాస్తులకు అన్నిరకాల అనుమతులు మంజూరు చేసినట్టు జిల్లా పరిశ్రమల అధికారి పాపారావు వివరించారు. కాలుష్య నియంత్రణ మండలి వద్ద 16 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, ఒక దరఖాస్తును పీసీబీ తిరస్కరించిందన్నారు. జిల్లాలోని ఏపీఐఐసీ ఆధ్వర్యంలోని పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల ఏర్పాటుకోసం అందుబాటులో ఉన్న భూముల పరిస్థితిని ఆ సంస్థ జోనల్ మేనేజర్ యతిరాజులు తెలియజేశారు. సమావేశంలో ఆర్డీఓ ఎం.వి.సూర్యకళ, ఏపీఐఐసీ డైరెక్టర్ బంగారు నాయుడు, డీఆర్‌డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, గనుల శాఖ డీడీ, మెప్మా పీడీ సుధాకర్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సరిత, ఈపీడీసీఎల్ డీఈ ధర్మరాజు, ఎంవీఐ దుర్గాప్రసాద్, ఉద్యానశాఖ డీడీ జమదగ్ని, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ నాగలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment