ప్రభుత్వ భూములను గుర్తించాలి
పార్వతీపురం: జిల్లాలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వ భూములను గుర్తించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో పలు వసతులు ఏర్పాటు చేయాల్సి ఉన్నందున అందుకు అవసరమైన భూమిని మండలాల్లో గుర్తించాలని సూచించారు. 100 విద్యుత్ కనెక్షన్ల కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో సోలార్ పవర్ ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని గుర్తించాలని చెప్పారు. గ్రామ పంచాయతీ భ భవనాల నిర్మాణానికి, ఫిష్ మార్కెట్ ఏర్పాటు, నగర వనాలు నెలకొల్పేందుకు, పారిశ్రామిక వాడల ఏర్పాటుకు అవసరైన స్థలాలను గుర్తించాలని స్పష్టం చేశారు. ఫిష్ హ్యాచరీస్ నిర్మాణానికి ఐదు హెక్టార్ల భూమి అవసరమని అభిప్రాయ పడ్డారు. అడంగల్‌ను సక్రమంగా నిర్వహించాలని కోరారు. పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలపై పూర్తిస్థాయిలో విచారణ చేసి పరిష్కరించాలని స్పష్టం చేశారు. సమావేశంలో పార్వతీపురం, పాలకొండ సబ్‌కలెక్టర్లు అశుతోష్ శ్రీవాత్సవ, సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, డీఆర్‌ఓ కె.హేమలత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment