ఏనుగుల విధ్వంసం
భామిని:మండల కేంద్రానికి చెందిన రైతు పోత ల చంద్రభూషణ్ నిల్వ చేసిన వరిచేను కుప్ప ను ఏనుగుల గుంపు మంగళవారం రాత్రి తిని వేసి ధ్వంసం చేశాయి. దీంతో రెండు ఎకరాల్లో ని సుమారు రూ.80వేల విలువైన వరిపంట పాడైందని బాధిత రైతు వాపోతున్నాడు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.
కన్యకాపరమేశ్వరికి వెండి సింహాసనం
విజయనగరం టౌన్: పట్టణంలో కొలువైన కన్యకాపరమేశ్వరి అమ్మవారికి వెండి సింహాసనాన్ని ప్రముఖ వ్యాపారవేత్త కీర్తిశేషుడు నారాయణం విశ్వనాథం కుటుంబసభ్యులు బుధవారం మార్గశిర మాసం దశమి సందర్భంగా సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని వెండి సింహాసనంలో ఆసీనులును చేసి వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సీఏ.నారాయణం వెంకటరమణమూర్తి, వెంకట చలమాజీ, కామేశ్వరరావు, ఈశ్వర్‌కుమార్, శేఖర్, ఏడుకొండలు, రాంజీ, అనంతపల్లి కృష్ణారావు, గణపతిరావు, పాలకమండలి సభ్యులు కుమ్మరిగుంట శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
జాతీయపోటీల్లో రాణించిన గురుకుల పాఠశాల విద్యార్థి
సాలూరు: పట్టణ పరిధిలోని పీఎన్ బొడ్డవలసలో గల డా.బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థి జాతీయస్థాయి పోటీల్లో రాణించినట్లు ప్రిన్సిపాల్ ఆశీర్వాదం బుధవారం తెలిపారు. ఈ నెల 19 నుంచి 24 వరకు జమ్ముకశ్మీర్‌లో జరిగిన జాతీయస్థాయి సబ్ జూనియర్ క్రీడాపోటీల్లో సాఫ్ట్‌బాల్ విభాగంలో ఆంద్రప్రదేశ్ జట్టు తరఫున ఆడిన జట్టులో పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నితిన్‌సాయి మనోహర్ బ్రాంజ్ మెడల్ సాధించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థిని ప్రిన్సిపాల్‌తో పాటు పీడీ విద్యాసాగర్, పీఈటీ నాయుడులు అభినందించారు.
నేడు అండర్–17 ఫెన్సింగ్ క్రీడాకారుల ఎంపిక
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అండర్–17 బాల, బాలికల ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక ఈనెల 26న నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధి డీవీ చారిప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి నగర శివారుల్లో గల విజ్జీ స్టేడియంలో ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఎంపిక పోటీల్లో 2008 జనవరి 1 నుంచి 2011 డిసెంబర్ 21వ తేదీ మధ్య జన్మించిన క్రీడాకారులు మాత్రమే పాల్గొనేందుకు అర్హులుగా పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 28, 29 తేదీల్లో కాకినాడ జిల్లాలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని వెల్లడించారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వరి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
● సీపీఎం నాయకుడు రామారావు
నెల్లిమర్ల: వరి పంట రైతులను తక్షణమే ప్రభుత్వం ఆడుకోవాలని సీపీఎం నాయకుడు కిల్లంపల్లి రామారావు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి పంట పూర్తిగా నాశనమైందన్నారు. ముఖ్యంగా తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలకు వరి పనలకు మొలకలు వచ్చాయని చెప్పారు. ఎకరా వరి పంట సాగుకు రూ. 50 వేలు ఖర్చవ్వగా.. ఒక్క పైసా కూడా చేతికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత రైతులను ఆదుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment