టిడ్కో ఇళ్లకు గ్రహణం
పార్వతీపురంటౌన్: గత ప్రభుత్వం 95 శాతం నిర్మించిన టిడ్కోఇళ్లకు గ్రహణం పట్టింది. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఇళ్ల పంపిణీ నిలిచిపోయింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపించి సకాలంలో ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి చేశారు. టిడ్కో గృహ సముదాయాల వద్ద పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించారు. అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ గృహాలను అందించాలని శరవేగంగా పనులు చేపట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కనీసం వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు. టిడ్కో ఇళ్లు అందక అద్దె ఇళ్లలోనే అవస్థలు పడుతున్నారు.
పేదల వద్ద వసూలు
పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు, పార్వతీపురంలలో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి లబ్ధి దారులను గుర్తించి 2017లో వారి వాటాగా రూ.500 కేటగిరిలో 300 చదరపు అడుగులు, రూ.25000 కేటగిరిలో 365 చదరపు అడుగులు, రూ.50వేల కేటగిరిలో 430 చదరపు అడుగుల్లో ఇళ్ల నిర్మాణానికి నిర్ణయించారు. ఈ మేరకు లబ్ధిదారుల నుంచి పార్వతీపురంలో రూ.1.75 కోట్లు, సాలూరులో రూ.1.08 కోట్లు వసూలు చేశారు. పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన టీడీపీ ప్రభుత్వం కనీసం పనులు ప్రారంభించలేదు.
పేదల ఇళ్లపై వివక్ష తగదు
నూతన ప్రభుత్వం రావడంతో టిడ్కో ఇళ్ల మిగులు పనులు ప్రారంభించ లేదు. గత వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పరిపాలనా కాలంలో దాదాపు పూర్తి చేశాం. లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ పూర్తి చేశాం. జిల్లాలో పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లో 1898 ఇళ్లు నిర్మించాం. పార్వతీపురంలో తాగునీరు, డ్రైనేజీ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటిని పూర్తి చేసేందుకు గత ప్రభుత్వం రూ. 11 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై వివక్ష చూపడం సరికాదు. మిగులు పనులు పూర్తి చేసి పేదలకు అందజేయాలి
– జమ్మాన ప్రసన్నకుమార్, ఏపీ టిడ్కో మాజీ చైర్మన్
కూటమి ప్రభుత్వం చొరవ చూపడం లేదు
2017లో నాకు టిడ్కో ఇల్లు మంజూరు చేశారు. అప్పుడు రూ.500 చెల్లించాను. కేవలం శంకుస్థాపనకే పరిమితమైంది. టీడీపీ ఇళ్ల నిర్మాణం ప్రారంభించలేదు. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇళ్లు పనులు ప్రారంభించి దాదాపు పూర్తి చేశారు. నా పేరు మీద రిజిష్ట్రేషన్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి 6 నెలలు గడుస్తున్నా మిగులు పనులు ప్రారంభించలేదు.
– పి. మార్కండేయులు, లబ్ధిదారు పార్వతీపురం
సొంతిల్లు లేక అద్దె
ఇంటిలో ఉంటున్నాం
20 ఏళ్లుగా అద్దె ఇంటిలో ఉంటున్న నాకు టిడ్కో ఇల్లు దక్కింది. 2017వ సంవత్సరంలో సొంతిల్లు అందుతోందన్న ఆశతో అప్పు చేసి తొలివిడతలో రూ.12,500 వేలు చెల్లించాను, ఇప్పటివరకు ఇల్లు కేటాయించక పోవడంతో ఒక వైపు రుణానికి వడ్డీ, మరో వైపు అద్దె చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు.
– కె.స్వామి, లబ్ధిదారు, పార్వతీపురం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయికే..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయికే పేదలకు ఇల్లు అందించేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా సాలూరు మున్సిపాలిటీ పరిధిలో 1100, పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో 798 టిడ్కో ఇళ్ల పంపిణీకి చర్యలు చేపట్టారు. ఐదేళ్ల కాలంలో శరవేగంగా పనులు చేపట్టి 95 శాతం పూర్తి చేశారు. మిగులు పనులు పూర్తి చేసేందుకు ఎన్నికల ముందు రూ.11 కోట్లు మంజూరు చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా పనులు నిలిపివేశారు. గృహ సముదాయాల వద్ద పూర్తిస్థాయిలో మౌలిక వసతులు, ఆహ్లాద వాతావరణం కల్పించేందుకు పార్కులు, తాగునీటి సౌకర్యం పూర్తిస్థాయిలో కల్పించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు టిడ్కో గృహాల ఊసెత్తడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment