తిరుమల పవిత్రతను దెబ్బ తీస్తున్నారు
సాలూరు: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్న తిరుమల తిరుపతి పవిత్రతను టీడీపీ కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుండడం చాలా బాధాకరమని మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన పట్టణంలోని తన స్వగృహంలో స్థానిక విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి తిరుమల పవిత్రతను దెబ్బతీస్తోందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లడ్డూలో కల్తీ నెయ్యి వాడారంటూ ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు అసత్య ఆరోపణల ద్వారా నానారాద్ధాంతంచేశారని దుయ్యబట్టారు. ఇటీవల వైకుంఠ ఏకాదశి టిక్కెట్ల విషయంలో సరైన ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం వల్ల అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి నెలకొందని వాపోయారు. దీనిపై ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదన్నారు. కాగా వారి అజాగ్రత్త, అశ్రద్ధ కారణంగా ఈ సంఘటన జరిగితే దానిని అంగీకరించేలేక ఆ నిందలను జగన్‌మోహన్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలపై నెట్టే ప్రయత్నం చేయడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. గతంలో జగన్‌మోహన్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో తిరుమలలో చేపట్టే కార్యక్రమాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేయించడం వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని గుర్తుచేశారు. చంద్రబాబు పాలనలోనే రాష్ట్రంలో ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర
Comments
Please login to add a commentAdd a comment