పచ్చని ప్రదర్శనల బడి అవార్డులఒడి
● నేషనల్ గ్రీన్ పాఠశాలగా రేగిడి జెడ్పీ ఉన్నత పాఠశాల ఎంపిక
● ఫిబ్రవరి 4న అవార్డు ప్రదానం చేయనున్న జాతీయ మానవ
వనరులశాఖ
రేగిడి:
ఆ పాఠశాల విద్యార్థులు ప్రకృతిని ప్రేమిస్తారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతారు. పర్యావరణానికి మేలుచేసే పనులు తలపెడతారు. పర్యావరణ హిత ఆలోచనలను ప్రాజెక్టుల రూపంలో ప్రదర్శిస్తూ అవార్డుల పంట పండిస్తున్నారు. వారే.. రేగిడి జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు అవార్డులను కై వసం చేసకున్న పాఠశాల విద్యార్థులు తాజాగా ప్రతిష్టాత్మకమైన జాతీయ మానవవనరులశాఖ అందించే గ్రీన్ పాఠశాల అవార్డును సొంతం చేసుకున్నారు. నేషనల్ గ్రీన్ కార్ప్, జాతీయ మానవ వనరులశాఖ సంయుక్తంగా వచ్చేనెల 4న అవార్డును అందించనున్నాయి.
● అన్నీ ప్రకృతి పరిరక్షణ కార్యక్రమాలే..
నేషనల్ గ్రీన్ కార్నర్స్‌లో రేగిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాతీయ స్థాయిలో నిలిచింది. పాఠశాలలోని జీవశాస్త్ర ఉపాధ్యాయిని బూరవెల్లి ఉమామహేశ్వరి గైడెన్స్‌లో, పాఠశాల హెచ్‌ఎం వావిలపల్లి లక్ష్మణరావు ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు పలు పర్యావరణ హితమైన కార్యక్రమాలు నిర్వహించారు. గుడ్డ సంచుల పంపిణీ, స్వచ్ఛతా హీ సేవ, ప్రతి గ్రామానికి మొక్కలు, మట్టి విగ్రహాల పంపిణీ, ఇంకుడు గుంతల నిర్మాణం, కంపోస్టు ఎరువులు తయారీ విధానంలో అవగాహన, రక్షా బంధన్‌లో భాగంగా చెట్లకు రాఖీలు కట్టడం, పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులతో మొక్కలు నాటించే కార్యక్రమాలు, గ్రామాల్లో పండ్లు, కూరగాయల మొక్కలతో పాటు ఔషధ మొక్కలు నాటడం వంటివి చేశారు. వీటికి సంబంధించిన ప్రాజెక్టును జాతీయస్థాయిలో పవర్‌పాయింట్‌ప్రజంటేషన్ చేశారు. దీనికి కేంద్ర మానవవనరుల శాఖ ఫిదా అయ్యింది. పాఠశాలను గ్రీన్ స్కూల్‌గా గుర్తింపు ఇచ్చింది. పాఠశాలకు ఫిబ్రవరి 4న ఢిల్లీలో అవార్డును ప్రదానం చేస్తామంటూ హెచ్‌ఎంకు లేఖ పంపించింది. ఇప్పటికే స్టేట్ గ్రీన్ స్కూల్ అవార్డు దక్కించుకున్న స్కూల్‌కు ఇప్పుడు జాతీయ స్థాయి అవార్డు వరించడంపై పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బందిని ఎంఈఓలు ఎం.వి.ప్రసాదరావు, బి.ఎరకయ్య, ఎంపీపీ దార అప్పలనరసమ్మ, వైస్ ఎంపీపీలు టంకాల అచ్చెన్నాయుడు, వావిలపల్లి జగన్మోహనరావు, సర్పంచ్ కిమిడి రవిశంకర్, తదితరులు అభినందించారు.
అందరి సహకారంతో..
పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్టుల ప్రదర్శన, ప్రకృతిని కాపాడే అంశాల్లో పాఠశాలకు అవార్డులు వరించడం ఆనందంగా ఉంది. పరిసర గ్రామాల్లో విద్యార్థులు తలపెట్టిన గ్రీన్ ప్రొటెక్టివ్ కార్యక్రమాలకు స్కూల్ కమిటీ, యాజమాన్య కమిటీలు సహకరిస్తున్నాయి. విద్యార్థుల పర్యావరణ పరిరక్షణ ఆలోచనలు ప్రాజెక్టుల రూపంలో పోటీ వేదికలపై మెరుస్తున్నాయి. అవార్డులు సాధిస్తున్నాయి.
– బూరవెల్లి ఉమామహేశ్వరి,
సైన్స్ ఉపాధ్యాయిని, రేగిడి జెడ్పీ హైస్కూల్
Comments
Please login to add a commentAdd a comment