వనపర్తి టౌన్: హైదరాబాద్ ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని పుర కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని బుధవారం ఉదయం కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సన చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి యాజమాన్యం రూ.కోట్ల విలువైన మామోగ్రమి యంత్రాలను జిల్లాకు తీసుకొచ్చారన్నారు. పుర పారిశుద్ధ్య మహిళా కార్మికులు, గ్రామాల్లోని క్యాన్సర్ అనుమానిత మహిళలను 102 వాహనంలో తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేయిస్తున్నట్లు తెలిపారు. సన చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు సురభి సత్తయ్య, ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యురాలు, ఆదాయపన్ను శాఖ ప్రధాన కమిషనర్ సురభి నర్సమ్మ మాట్లాడుతూ.. మహిళలు కుటుంబంపై పెట్టే దృష్టి తమ ఆరోగ్యంపై ఉంచరని, ఆరోగ్యం క్షీణించాక బాధ పడుతుంటారన్నారు. మహిళలకు ఆరోగ్యపరంగా సాయం చేయాలనే ఉద్దేశంతో ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా పుర చైర్మన్ పి.మహేష్ ఆస్పత్రి యాజమాన్యానికి, సన చారిటబుల్ ట్రస్ట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, కలెక్టర్ సతీమణి డా. నిపుణ్‌కుమారి, ఎంఎన్‌జే ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. ప్రసాద్, ప్రోగ్రాం ఆఫీసర్ డా. సాయినాథ్‌రెడ్డి, డా. రామచంద్రరావు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment