ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు మన్మోహన్
వనపర్తి: దేశ ఆర్థిక సంస్కరణల ఆద్యుడు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కొనియాడారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో మన్మోహన్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రత్యేక రాష్ట్ర బిల్లును ఆమోదింపజేశారని గుర్తుచేశారు. 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా సేవలందించారన్నారు. 33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం రాత్రి మృతి చెందడం బాధాకరమని వివరించారు.
నిజాయితీ రాజకీయాలకు దిక్సూచి..
వనపర్తి టౌన్: నిజాయితీ రాజకీయాలకు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ నిదర్శనమని డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, పార్టీ పట్టణ అధ్యక్షుడు విజయచందర్ అన్నారు. శుక్రవారం డీసీసీ కార్యాలయం, జిల్లాకేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో వేర్వేరుగా నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని మన్మోహన్‌సింగ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఆర్బీఐ గవర్నర్‌గా, కేంద్ర మంత్రిగా, దేశ ప్రధానిగా సమర్థవంతమైన సేవలు అందించారని గుర్తుచేశారు. గ్రామీణ ఉపాధిహామీ పథకం, సమాచార హక్కు చట్టం ఆయన హయాంలోనే వచ్చాయన్నారు. దేశం ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు సంస్కరణలతో ఆర్థికంగా దేశాన్ని గట్టెక్కించారని కొనియాడారు. మన్మోహన్‌సింగ్ మృతి కాంగ్రెస్ పార్టీ, దేశానికి తీరని లోటన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు లక్కాకుల సతీష్, నందిమళ్ల చంద్రమౌళి, కదిరె రాములు, యాదయ్య, ఎల్‌ఐసీ కృష్ణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment