వనపర్తి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సర్వే చేస్తున్న సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని, అదేవిధంగా అనర్హులను గుర్తించి నిస్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. సర్వేకు ముందే దరఖాస్తుదారుడికి సమాచారం ఇవ్వాలని.. ప్రస్తుతం ఉన్న ఇల్లు, అందులో ఉన్న మౌలిక వసతుల ఫొటోలను సేకరించాలన్నారు. కొత్తగా ఇల్లు నిర్మించుకునేందుకు ఉన్న ఖాళీ స్థలం ఫొటో తీసి జియోట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలు చూపిస్తే అంగీకరించవద్దని, లాగిన్‌లు తీసుకొని సర్వే చేయకుండా ఉన్న సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటి వరకు లక్ష్యం మేర సర్వే చేయని మండల అధికారుల గురించి తెలుసుకున్నారు. డిసెంబర్ 27 శుక్రవారం నాటికి జిల్లాలో 84,141 దరఖాస్తుల సర్వే పూర్తి చేసినట్లు వివరించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, హౌసింగ్ డీఈఓ విఠోబా పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి
Comments
Please login to add a commentAdd a comment