నత్తనడకన రహదారి పనులు
ఖిల్లాఘనపురం: మండల కేంద్రం నుంచి పర్వతాపురం, అప్పారెడ్డిపల్లి, మామిడిమాడ, సల్కెలాపురం గ్రామాల మీదుగా భూత్పూర్ మండలం వెల్కిచెర్లకు వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు ఇలాగే కొనసాగితే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఆయా గ్రామస్తులు చెబుతున్నారు.
రూ.2.60 కోట్లుతో..
బీటీ రహదారి పునరుద్ధరణ పనులకుగాను ప్రభుత్వం ఆర్‌అండ్‌బీ నిధులు రూ.2.60 కోట్లు మంజూరు చేసింది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు ప్రారంభించి కల్వర్టు నిర్మాణాలు పూర్తిచేసి వదిలేశారు. ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో కొంతదూరం రోడ్డుకు మొర్రం వేసి పనులు నిలిపివేశారు.
రాకపోకలకు అవస్థలు..
మండల కేంద్రం నుంచి పర్వతాపురం వరకు 6 కిలోమీటర్ల బీటీ రహదారి దెబ్బతిని గుంతలుగా మారింది. రాత్రిళ్లు ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్డుకు కొంతదూరం మొర్రం వేసి వదిలేయడంతో పెద్ద వాహనాలు రాకపోకలు సాగించే సమయంలో దుమ్ములేస్తుంది. నా సంబంధిత అధికారులు స్పందించి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకొని పనులు త్వరగా పూర్తి చేసేలా చూడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఉన్నతాధికారులకు విన్నవించాం..
ఖిల్లాఘనపురం నుంచి వెల్కిచెర్ల వరకు ఉన్న బీటీ రోడ్డు పనులను రెండు భాగాలుగా విభజించి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఇప్పటి వరకు ఒక భాగం పనులు పూర్తికాగా.. ఖిల్లాఘనపురం నుంచి పర్వతాపురం వరకు ఉన్న రోడ్డు పనులు కాంట్రాక్టర్ చేయడం లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కాంట్రాక్టర్‌తో మాట్లాడి పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – రాకేశ్, ఏఈ, ఆర్‌అండ్‌బీశాఖ
ఖిల్లాఘనపురం–వెల్కిచర్ల రోడ్డు నిర్మాణానికి రూ.2.60 కోట్లు మంజూరు
ఏడాది దాటినా పూర్తికాని వైనం
రాకపోకలకు అవస్థలు పడుతున్న వాహనదారులు
Comments
Please login to add a commentAdd a comment