మనో సంకల్పం ముందు వైకల్యం చిన్నది
కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ: మనో సంకల్పం ముందు వైకల్యం చాలా చిన్నదని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. మంగళవారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్‌లో జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ వైకల్యం ఉందని బాధపడవద్దని, భవిష్యత్‌పై దృష్టి సారించి జీవితాన్ని మలుచుకోవాలన్నారు. ఉపాధి రంగాల్లో రాణించాలనుకునేవారు ఓబీఎంఎస్ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగం ఆశించే వారు ఉపాధి శిక్షణ అధికారి పోర్టల్‌లో సంప్రదించాలన్నారు. అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి మా ట్లాడుతూ దివ్యాంగుల సౌకర్యార్థం ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో ర్యాంపులు నిర్మిస్తున్నామన్నారు. జిల్లా సంక్షేమాధికారి జె.జయంతి మాట్లాడుతూ ప్రీ పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు, స్వయం ఉపాధి పథకాలు, వివాహ ప్రోత్సాహకం, తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ, దివ్యాంగుల ఉపాధి అవకాశాలపై వివరించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం ఇటీవల జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన క్రీడల్లో విజేతలైన దివ్యాంగులకు కలెక్టర్ ప్రావీణ్య బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కమిషన్ సభ్యుడు దర్శన్‌సింగ్, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్‌జేడీ ఝాన్సీ లక్ష్మిబాయి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య, డీఆర్‌డీఓ ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు
అవినీతిని తరిమేద్దాం
హన్మకొండ అర్బన్ : అవినీతిని తరిమేద్దాం – దేశాభ్యుదయానికి పునాదులు వేద్దామని, ఏ ప్రభుత్వ అధికారైనా మీ పని చేసేందుకు లంచం అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 సమాచారం అందించాలని కలెక్టర్ ప్రావీణ్య ప్రజలకు సూచించారు. ఏసీబీ వారోత్సవాల్లో భాగంగా రూపొందించిన కరపత్రాలు, పోస్టర్లను కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం ఆవిష్కరించారు. జిల్లాను అవినీతి రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ అవినీతి నిరోధక శాఖకు సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య, ఇన్‌స్పెక్టర్ సమ్మయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment