మెనూ ప్రకారం భోజనం అందించండి
ఆర్‌జేడీ సత్యనారాయణరెడ్డి
ఎల్కతుర్తి: విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని, పరిశుభ్రత పాటించాలని పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీ (రీజనల్ జాయింట్ డైరెక్టర్) సత్యనారాయణరెడ్డి సూచించారు. మండలంలోని వల్భాపూర్ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. మధ్యాహ్న భోజన రిజిస్టర్, పదవ తరగతి ప్రత్యేక తరగతుల నిర్వహణ రిజిస్టర్ తనిఖీ చేశారు. వంటపాత్రలు పరిశుభ్రంగా ఉంచాలని, నాణ్యమైన వంట సరుకులు ఉపయోగించాలని, వారానికి మూడు గుడ్లతో కూడిన పౌష్టికాహారం విద్యార్థులకు వడ్డించాలని సూచించారు. వంట గది పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణలో పూర్తి సమయం కేటాయించాలని, డిసెంబర్ 31వరకు సిలబస్ పూర్తి చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ విద్యాసంవత్సరంలో నూటికి నూరుశాతం ఉత్తమ ఫలితాలు సాదించేలా కృషి చేయాలన్నారు. ఆయన వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బద్దం సుదర్శన్, ఉపాధ్యాయులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment