అరుణాచలానికి ప్రత్యేక బస్సు
నర్సంపేట: నర్సంపేట ఆర్టీసీ డిపో నుంచి అరుణాచల గిరి ప్రదక్షిణకు 36 సీట్ల ప్రత్యేక సూపర్‌లగ్జరీ బస్సును ఈనెల 20న ప్రారంభించనున్నట్లు డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నర్సంపేట నుంచి బీచుపల్లి హనుమాన్ టెంపుల్, జోగుళాంబ అమ్మవారి టెంపుల్, కాణిపాకం వినాయ టెంపుల్, వేలూరు గోల్డెన్ టెంపుల్, అరుణాచలం గిరి ప్రదక్షిణ దర్శనాల అనంతరం తిరుగు ప్రయాణం ఉంటుందని తెలిపారు. నాలుగు రోజులపాటు కొనసాగే ఈ యాత్రను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు 9959226052, 8919313229, 9989038476 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
గ్రూప్–2 పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్
సీపీ అంబర్ కిషోర్ ఝా
వరంగల్ క్రైం: ఈనెల 15, 16 తేదీల్లో జరగనున్న గ్రూప్–2 పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్ యాక్ట్–23 అమలులో ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల్ని సజావుగా నిర్వహించేందుకు కేంద్రాల వద్ద 15వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 16వ తేదీ రాత్రి 7 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని, ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డీజేలతో ఉరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. పరీక్ష సమయంలో పరిసరాల్లోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని సూచించారు. ఎవరైనా ఉత్తర్వులు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శిగా వెంకటేశ్వర్లు
నర్సంపేట: తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శిగా నర్సంపేట పట్టణానికి చెందిన వెల్దండి వెంకటేశ్వర్లును నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తనపై నమ్మకంతో కార్యదర్శిగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు వీరమోహన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 28న హైదరాబాద్‌లోని ధనుంజయ గార్డెన్‌లో జరిగే ప్రమాణ స్వీకారానికి పద్మశాలీలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.
దూరవిద్య సైన్స్‌కోర్సుల
‘మొదటి సెమిస్టర్’ షెడ్యూల్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్యకేంద్రం (ఎస్‌డీఎల్‌సీఈ) ఎమ్మెస్సీ బాటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ, మ్యాథమెటిక్స్ ఫస్టియర్ మొదటి సెమిస్టర్ పరీక్షల(2023–2024) టైంటేబుల్‌ను పరీక్షల విభాగం అధికారులు శుక్రవారం విడుదల చేశారు. వచ్చే ఏడాది జనవరి 7, 9, 17, 20, 22 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారని కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ తెలిపారు.
కన్నె రాజుకు జాతీయ సేవాపురస్కారం
ఖానాపురం: మండలంలోని రాగంపేట గ్రామానికి చెందిన కానిస్టేబుల్ కన్నె రాజు గద్దర్ జాతీయ సేవా పురస్కాన్ని శుక్రవారం అందుకున్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మమత స్వచ్ఛంద సేవా సమితి బాధ్యులు వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందిస్తున్న వారిని సేవా పురస్కారాలకు ఎంపిక చేశారు. ఇందులో భాగంగా 20 సంవత్సరాలుగా రక్తదానం పై చేస్తున్న సేవలను గుర్తించి రాజును పురస్కారానికి ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గన్నవరంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి డాక్టర్ వెన్నెల, గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. కాగా, రాజును ఈ సందర్భంగా పలువురు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment