అమ్మ కొడుతుందేమోనని
ఖిలా వరంగల్: పుట్టిన రోజు అని అమ్మమ్మ ఆ బాలుడికి రూ.1,000 ఇచ్చింది. అవి కాస్తా బ్యాగులో పెట్టుకుని స్కూలుకు వెళ్లాడు. డబ్బులు ఎక్కడో పోయాయి. విషయం తెలిస్తే అమ్మ కొడుతుందేమోనని భయపడి తన తండ్రి దగ్గరికి వెళ్దామని బయల్దేరినట్లు తెలిసింది. ట్రైన్ ఎక్కి మహబూబాబాద్‌లో దిగాలనుకున్నాడు. చివరికి నెల్లూరు దాకా ప్రయాణించాడు. అర్ధరాత్రి జీఆర్పీ సిబ్బందికి చిక్కడంతో ఆ తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. వరంగల్ శివనగర్‌లో గురువారం తప్పిపోయిన బాలుడి ఆచూకీ ఎట్టకేలకు అదే రోజు అర్ధరాత్రి లభించింది. వరంగల్ శివనగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న కుడ్ల యశ్వంత్ గురువారం సాయంత్రం అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే మిల్స్‌కాలనీ పోలీసులకు సమాచారం అందించా రు. ఇన్స్పెక్టర్ జూపల్లి వెంకటరత్నం అలర్ట్ అయ్యారు. విద్యార్థి ఆచూకీ గురించి ప్రయత్నం మొదలెట్టారు. పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి శివనగర్‌లో తనిఖీలు చేపట్టారు. మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం వరంగల్ రైల్వేస్టేషన్‌లోని సీసీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. సాయంత్రం వరంగల్ నుంచి మచిలీపట్నం వెళ్లే ట్రైన్లో బాలుడు ఎక్కినట్లు గు ర్తించారు. వెంటనే వరంగల్ జీఆర్పీఎఫ్ అధికారులు అన్ని రైల్వేస్టేషన్లకు సమాచారం ఇచ్చారు. గురువారం అర్ధరాత్రి నెల్లూరు రైల్వేస్టేషన్‌కు ట్రైన్ చేరుకోగానే తప్పిపోయిన బాలుడిని జీఆర్పీ సిబ్బంది గుర్తించారు. విద్యార్థి యశ్వంత్ సమాచారాన్ని జీఆర్పీ సిబ్బకి, వరంగల్ మిల్స్‌కాలనీ పోలీసులకు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. శుక్రవారం బాలుడిని నెల్లూరు జీఆర్పీ సిబ్బంది మిల్స్‌కాలనీ పోలీసులకు అప్పగించారు. సాయంత్రం మిల్స్ కాలనీ పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. విద్యార్థి ఆచూకీ లభించడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. బాలుడి మిస్సింగ్ కేసును ఛేదించిన మిల్స్‌కాలనీ, జీఆర్పీఎఫ్ పోలీసులను శుక్రవారం వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ అభినందించారు.
వరంగల్‌లో ట్రైన్ ఎక్కి నెల్లూరుకు చేరిన బాలుడు
మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment