క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలి
హన్మకొండ అర్బన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కిస్మస్ వేడుకల ఏర్పాట్లపై జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడారు. క్రిస్మస్ వేడుకల కోసం ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం పాస్టర్స్ మత ప్రబోధకులతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మురళీధర్‌రెడ్డి, పాస్టర్ ఐజాక్, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ నారాయణ, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
పెరట్లో గంజాయి
పెంచుతున్న ఒకరి అరెస్ట్
వరంగల్ క్రైం: పెరట్లో గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధి న్యూశాయంపేటలో నివాసం ఉంటున్న అట్ల వెంకట నర్సయ్య వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని పెరట్లో గంజాయి మొక్కల పెంపకాన్ని చేపట్టాడు. వాటిలో ఎండబెట్టి విక్రయించేందుకు సిద్ధమయ్యాడు. యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీంకు సమాచారం రావడంతో ఇన్‌స్పెక్టర్ సురేశ్, ఆర్‌ఐ శివ కేశవులు తనిఖీ చేసి పెరట్లో మొక్కను గుర్తించారు. నర్సయ్యను అదుపులోకి తీసుకుని సుబేదారి పోలీసులకు అప్పగించారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనిఖీల్లో ఆర్‌ఎస్సైలు పూర్ణ, మనోజ్, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
గ్రూప్–2 పరీక్ష కేంద్రాల వద్ద
163 సెక్షన్
వరంగల్ క్రైం: ఈనెల 15, 16 తేదీల్లో జరగనున్న గ్రూప్–2 పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్ యాక్ట్–23 అమలులో ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల్ని సజావుగా నిర్వహించేందుకు కేంద్రాల వద్ద 15వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 16వ తేదీ రాత్రి 7 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని, ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డీజేలతో ఉరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. పరీక్ష సమయంలో పరిసరాల్లోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని సూచించారు. ఎవరైనా ఉత్తర్వులు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
దూరవిద్య సైన్స్‌కోర్సుల
‘మొదటి సెమిస్టర్’ షెడ్యూల్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్యకేంద్రం (ఎస్‌డీఎల్‌సీఈ) ఎమ్మెస్సీ బాటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ, మేథమెటిక్స్ ఫస్టియర్ మొదటి సెమిస్టర్ పరీక్షల(2023–2024) టైంటేబుల్‌ను పరీక్షల విభాగం అధికారులు శుక్రవారం విడుదల చేశారు. వచ్చే ఏడాది జనవరి 7, 9, 17, 20, 22 తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తారని కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment