పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే
వరంగల్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక సర్వేను పారదర్శకంగా ఈనెల 31లోగా పూర్తిచేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ సత్య శారద అధ్యక్షతన ఇందిరమ్మ నోడల్ అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులకు శుక్రవారం జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ వర్చువల్‌గా హైదరాబాద్ నుంచి మాట్లాడుతూ ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని, వచ్చే నాలుగు సంవత్సరాల్లో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు. శాయంపేటకు చెందిన ఇందిరమ్మ కమిటీ సభ్యుడు శివ నుంచి ఇందిరమ్మ ఇళ్ల వివరాల సర్వేను అడిగి తెలుసుకున్నారు. కమిటీలు నిస్వార్థంగా పనిచేసి అర్హులను ఎంపికచేయాలని, అక్రమాలకు పాల్ప డితే కఠిన చర్యలు తప్పవని మంత్రి ఈ సందర్భంగా హెచ్చరించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమంలో 2,33,332 మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. మొత్తం 393 కమిటీలను నియమించినట్లు చెప్పారు. ఈనెల 16 నుంచి 31లోగా సర్వే చేసేందుకు 619 మంది ఎన్యుమరేటర్లను నియమించినట్లు పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, నర్సంపేట, పరకాల ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వర్చువల్‌గా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ గుంటి రజిత మాట్లాడారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి పాల్గొన్నారు.
ఎంపికలో అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు
అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం
Comments
Please login to add a commentAdd a comment