అమ్మ కొడుతుందేమోనని..
● ట్రైన్ ఎక్కి నెల్లూరుకు చేరిన బాలుడు
● మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు
ఖిలా వరంగల్: పుట్టిన రోజు అని అమ్మమ్మ ఆ బాలుడికి రూ.1,000 ఇచ్చింది. అవి కాస్త బ్యాగులో పెట్టుకుని స్కూలుకు వెళ్లాడు. డబ్బులు ఎక్కడో పోయాయి. పుట్టిన రోజు వేడుకలు చేసుకోలేదు. విషయం తెలిస్తే అమ్మ కొడుతుందని భయపడి తన తండ్రి దగ్గరికి వెళ్దామని బయల్దేరాడు. రైలు ఎక్కి మహబూబాబాద్‌లో దిగాలనుకున్నాడు. చివరికి నెల్లూరు దాకా ప్రయాణించాడు. అర్ధరాత్రి జీఆర్పీ సిబ్బందికి చిక్కడంతో ఆ తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. శివనగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న కుడ్ల యశ్వంత్ గురువారం సాయంత్రం అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే మిల్స్‌కాలనీ పోలీసులకు సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్ జూపల్లి వెంకటరత్నం వరంగల్ రైల్వేస్టేషన్‌లోని సీసీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. వరంగల్ నుంచి మచిలీపట్నం వెళ్లే ట్రైన్‌లో బాలుడు ఎక్కినట్లు గుర్తించారు. వరంగల్ జీఆర్పీఎఫ్ సిబ్బంది అన్ని రైల్వేస్టేషన్లకు సమాచారం ఇచ్చారు. గురువారం అర్ధరాత్రి నెల్లూరు రైల్వేస్టేషన్‌కు ట్రైన్ చేరుకోగానే తప్పిపోయిన బాలుడిని జీఆర్పీఎఫ్ సిబ్బంది గుర్తించారు. యశ్వంత్ సమాచారాన్ని వరంగల్ మిల్స్‌కాలనీ, జీఆర్పీఎఫ్ వరంగల్, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. శుక్రవారం బాలుడిని నెల్లూరు జీఆర్పీఎఫ్ సిబ్బంది మిల్స్‌కాలనీ పోలీసులకు అప్పగించారు. సాయంత్రం మిల్స్ కాలనీ పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment