పార్కింగ్ కే పరిమితమా?
ఆధునికతను వినియోగించుకుంటూ పురోగమిస్తున్న నగరాలున్నాయి. ఉన్న అవకాశాల్ని వాడుకోకుండా అభివృద్ధిలో వెనుకంజ వేస్తున్నవీ ఉన్నాయి. సరిగ్గా రెండో రకానికి చెందినదే ‘గ్రేటర్’ అని చెప్పవచ్చు. ఓ వైపు చెత్త గుట్టలుగా పేరుకుపోతుంటే.. మరో వైపు స్వీపింగ్ వాహనాలు తుప్పు పడుతున్నాయి. కోట్లు వెచ్చించి కొన్నది కేవలం పార్కింగ్ చేయడానికేనా? లేక కమీషన్ల కోసమే కొన్నారా? అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.
వరంగల్ అర్బన్: వాహనాలు కొనడం.. వాటి పేరుతో ఏజెన్సీలు, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకోవడం.. ఆతర్వాత మూలకు నెట్టడం గ్రేటర్ వరంగల్‌లో షరా మామూలైపోయింది. నాలుగేళ్ల కిందట కొన్న స్వీపింగ్ యంత్రాలు కూడా నిర్వహణ లేక మూలకు చేరాయి. రూ.కోట్లు వెచ్చించిన అప్పటి పాలకవర్గం పెద్దలు, అధికారులు.. తదుపరి ఆవాహనాల్ని ఆరు నెలలుగా పార్కింగ్‌కే పరిమితం చేశారు. నిర్వహణ, పర్యవేక్షణకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని మూలన చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ని కోట్లు వెచ్చించి యంత్రాలు కొనుగోలు చేసినప్పటికీ పారిశుద్ధ్య కార్మికులకు రోడ్లు శుభ్రం చేసే ఇబ్బందులు తప్పడం లేదు.
ప్రమాదాలు నివారించాలని..
రాత్రి, ఉదయం వేళల్లో ప్రధాన రహదారులపై వాహనాలు అతివేగంగా వెళ్తాయి. రోడ్లు శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా జీడబ్ల్యూఎంసీ భారీ స్వీపింగ్ వాహనాల్ని కొనుగోలు చేసింది. నగరంలో పారిశుద్ధ్య పనుల కోసం గ్రేటర్ హైదరాబాద్ తర్వాత వరంగల్‌కు ఎక్కువ వాహనాలున్నాయి. పాతవి 232 ఉండగా.. కొత్తవి 278 వరకున్నాయి. రెండేళ్ల కిందట పట్టణ ప్రగతి నిధులతో రూ.42.30 కోట్లు వెచ్చించి బల్దియా వాహనాల్ని కొనుగోలు చేసింది. అందులో భాగంగా ప్రధాన రహదారుల శుభ్రం కోసం 10 పెద్ద మిషన్లు (6.5 క్యూబిక్ మీటర్ల హూపర్) సామర్థ్యం కలిగిన (ట్రక్ మౌంటెడ్ మిషన్లు). 6 చిన్న స్వీపింగ్ యంత్రాలను సుమారు రూ. 4 కోట్ల పైచిలుకు నిధులతో కొనుగోలు చేశారు. చిన్నవి (ఒక క్యూబిక్ మీటరు హూపర్ సామర్థ్యం కలవి). మనుషులతో పని లేకుండా రోడ్లను ఊడ్చడంతోపాటు చెత్తను వాహనంలోని డబ్బాలోకి లాక్కోవడం వీటి ప్రత్యేకత. ఒక్కో మిషన్‌తో కనీసం 10 కిలోమీటర్ల చొప్పన ఊడ్చినా దాదాపుగా 80 శాతం ప్రధాన రహదారులు శుభ్రమవుతాయి. ఇలా దాదాపు 20 మంది కార్మికులు చేసే పనిని ఒక యంత్రం చేయగలదు.
కార్మికుల కొరత..
20 శాతం మంది పారిశుద్ధ్య కార్మికులు విధులకు ఎగనామం పెడుతూ జీతాలను పొందుతుండడంతో కార్మికుల కొరత ఏర్పడుతోంది. స్వీపింగ్ యంత్రాలు మూలకు చేరడంతో 120 మంది పారిశుద్ధ్య కార్మికులు ప్రధాన రహదారులను శుభ్రం చేసే పనుల్లో నిమగ్నమవుతున్నారు. రెండు సార్లు టెండర్లు పెట్టగా.. థర్డ్ పార్టీ ఏజెన్సీలు నిర్వహణకు ముందుకు రావడం లేదని, ప్రస్తుతం ఉన్న రేట్లు వర్కవుట్ కావడం లేదని బల్దియా ఇంజినీర్లు పేర్కొంటున్నారు. తాత్కాలికంగా 2 వాహనాల్ని బల్దియా డ్రైవర్లతో నడిపిస్తున్నట్లు సెలవిస్తున్నారు.
రూ.కోట్లు పెట్టి.. కమీషన్లు కొల్లగొట్టి!
స్లీపింగ్ దశకు చేరిన స్వీపింగ్
యంత్రాలు
గ్రేటర్ ఆవరణలో
నిరుపయోగంగా వాహనాలు
ఆరు నెలలుగా మూలకు..
స్వీపింగ్ యంత్రాలను మెయింటెనెన్స్, ఆపరేషన్ కింద బల్దియా.. థర్డ్ పార్టీకి కట్టబెట్టింది. పెద్ద స్వీపింగ్ యంత్రం కిలోమీటర్ ఊడ్చినందుకు గంటకు రూ.1,606, చిన్న యంత్రానికి గంటకు రూ. 806 చెల్లిస్తోంది. డ్రైవర్లు, డీజిల్, పరికరాలు, ఇతర ఖర్చు మొత్తం థర్డ్ పార్టీనే భరించాలి. అందుకుగాను బల్దియా ఈ సొమ్ము గంటల లెక్కన ఆ సంస్థకు చెల్లిస్తోంది. ఇలా పెద్ద స్వీపింగ్ యంత్రం 17,500 గంటలు, చిన్న వాహనం 11,680 గంటలు ఆపరేషన్ కింద అప్పగించారు. ఆర్నెళ్లుగా మెయింటెనెన్స్, ఆపరేషన్‌కు థర్డ్ పార్టీ కాంట్రాక్టర్లు ముందుకురావడం లేదని బల్దియా ప్రధాన కార్యాలయంలో రోడ్డుపైనే పార్కింగ్‌కు పరిమితం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment