విలీన వెతలు.. | - | Sakshi
Sakshi News home page

విలీన వెతలు..

Published Tue, Dec 17 2024 7:19 AM | Last Updated on Tue, Dec 17 2024 7:19 AM

-

సాక్షి, వరంగల్‌: జిల్లాలో నెక్కొండ మున్సిపాలిటీ ఏర్పాటు అంశం ఎనిమిదేళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న అంశాలను తెరమీదకు తీసుకొచ్చింది. 2016లో మండలాల పునర్విభజనలో భాగంగా చెన్నారావుపేట మండలం నుంచి నెక్కొండ మండలంలో చేరిన అమీన్‌పేట గ్రామం నుంచి, ఆ తర్వాత కొత్త పంచాయతీలుగా ఆర్‌ కే తండా (రామన్నకుంట తండా), టేకులకుంట (టీకే) తండాలు ఏర్పడ్డాయి. అయితే పేరుకే నెక్కొండ మండలంలోని ఈ గ్రామాలకు రెవెన్యూ గ్రామం చెన్నారావుపేట మండంలంలోని అమీనాబాద్‌ ఉండడంతో భూక్రయ విక్రయాల రిజిస్ట్రేషన్లు, పట్టాపాస్‌ పుస్తక సమస్యల పరిష్కారానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నారావుపేట మండలంలోని తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అదే సమయంలో పోలీస్‌స్టేషన్‌ పరిధి కూడా చెన్నారావుపేట ఠాణా పరిధిలో ఉండడంతో వివిధ గొడవలు, సమస్యలు, ప్రమాదం జరిగినప్పుడు ఫిర్యాదుల కోసం 14 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు. ఇన్నాళ్లూ ఈ విషయాన్ని వివిధ సందర్భాల్లో నాయకుల దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా పట్టించుకోకపోవడంతో శ్రీనెక్కొండ మున్సిపాలిటీశ్రీ ఏర్పాటు రూపంలో తమ సమస్యల గళం వినిపించేందుకు ఇప్పుడు వారికి వేదిక దొరికినట్టైంది. నెక్కొండ, నెక్కొండ తండా, గుండ్రపల్లి, పత్తిపాక గ్రామాలతో పాటు అమీన్‌పేట, టేకులకుంట(టీకే) తండాలతో ఏర్పడనున్న ఈ మున్సిపాలిటీకి ఆయా గ్రామాల్లో గ్రామసభల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు శ్రీకారం చుట్టారు. అయితే అమీన్‌పేట, టేకుల తండా గ్రామ ప్రజలు తమ గ్రామాలను రెవెన్యూ, పోలీస్‌స్టేషన్‌ల పరిధిని చెన్నారావుపేట మండలం నుంచి తమకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నెక్కొండ మండలానికి మారిస్తేనే మున్సిపాలిటీ ఏర్పాటుకు తమ మద్దతనే గళాన్ని వినిపిస్తున్నారు. మున్సిపాలిటీలో గ్రామాల విలీనం ద్వారా అంతర్గత రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం, రోడ్ల విస్తరణ తదితర అభివృద్ధి పనులు జరుగుతాయని అధికారులు వివరిస్తున్నా.. ఎనిమి దేళ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తేనే మేం ముందుకు వస్తామంటూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు.

మరికొన్ని గ్రామాలదీ అదే పరిస్థితి..

● నెక్కొండ మండలంలోని సూరిపల్లి గ్రామం చెన్నారావుపేట మండలం నుంచి 2016లోనే విలీనమైంది. నెక్కొండ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊరి ప్రజలు రెవెన్యూ సమస్యలు, పోలీస్‌స్టేషన్‌ కోసం 13 కిలోమీటర్ల దూరంలో ఉండే చెన్నారావుపేటకు వెళ్తున్న పరిస్థితి ఉంది.

● చెన్నారావుపేట మండలం నుంచి గురిజాల, చిన్న గురిజాల, గుంటూరుపల్లి, జీజీఆర్‌పల్లి, ముగ్ధుంపురం గ్రామాలు 2016లో నర్సంపేట మండలంలో కలిశాయి. అదే సమయంలో పోలీస్‌స్టేషన్‌ కూడా ఇంకా చెన్నారావుపేట పరిధిలోనే ఉండడంతో ఫిర్యాదులకు అక్కడికెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇలా వేలాది మంది జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అవగాహన ఉన్న రెవెన్యూ, పోలీసు అధికారులు మండలాలు మారిన ఈ గ్రామాలను ఆయా మండలాల పరిధిలోకి తీసుకెళ్లాలని సూచించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ముఖ్య ప్రజాప్రతినిధులు కూడా కొన్ని సందర్భాల్లో మారుస్తామని చెప్పినా ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు.

‘జిల్లాలోని తొమ్మిది గ్రామాల్లో విచిత్ర పరిస్థితి ఉంది. 2016లో మండలాల పునర్విభజనలో చెన్నారావుపేట మండలం నుంచి నెక్కొండ మండలంలో చేరిన అమీన్‌పేట గ్రామం నుంచి, ఆ తర్వాత కొత్త పంచాయతీలుగా ఆర్‌కే తండా (రామన్నకుంట తండా), టేకులకుంట (టీకే) తండాలు ఏర్పడ్డాయి. సూరిపల్లి గ్రామం కూడా విలీనమైంది. చెన్నారావుపేట మండలం నుంచి గురిజాల, చిన్న గురిజాల, గుంటూరుపల్లి, జీజీఆర్‌ పల్లి, ముగ్ధుంపురం గ్రామాలు కూడా నర్సంపేట మండలంలో కలిశాయి. అయితే పేరుకే ఈ గ్రామాలు సమీప మండలాల్లో విలీనమైనా రెవెన్యూ, పోలీస్‌స్టేషన్‌ పరంగా పాత మండలాల్లోనే ఉండడంతో కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. తాజాగా నెక్కొండ మున్సిపాలిటీ ఏర్పాటు అంశంతో మండలాలు మారిన ఇంకా పాత అవస్థలే ఉన్న గ్రామాల పరిస్థితి తెరమీదకు వచ్చింది’

ఎనిమిదేళ్లయినా మారని రెవెన్యూ, పోలీస్‌స్టేషన్‌ల పరిధి

ఇబ్బందులు పడుతున్న

తొమ్మిది గ్రామాల ప్రజలు

తాజాగా నెక్కొండ మున్సిపాలిటీతో

తెరమీదకు అవస్థలు

రెవెన్యూ పరిధి మార్చితేనే

మున్సిపాలిటీకి మద్దతు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement