హసన్‌పర్తి : మండలంలోని వంగపహాడ్ పీఏసీఎస్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకున్నారని పాలకవర్గ సభ్యులు ఆరోపించారు. ఈమేరకు జిల్లా సహకార సంఘం అధికారికి మంగళవారం ఫిర్యాదు చేశారు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో విధులు నిర్వర్తిస్తున్న రాజిరెడ్డి ధర్మసాగర్ పీఏసీఎస్‌కు బదిలీ కావడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో పాటు సేల్స్‌మెన్, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి తీర్మానం చేశారు. అయితే సీఈఓ పోస్ట్‌తో పాటు సేల్స్‌మెన్, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను రహస్యంగా రూ.1.50 లక్షలకు అమ్ముకున్నాడని సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు.పాలక వర్గానికి తెలియకుండానే పోస్టులు అమ్ముకున్నానని సభ్యులు వివరించారు. ధాన్యం కొనుగోలు వ్యవహారాల్లో కూడా అవినీతి జరిగినట్లు ఆ ఫిర్యాదులో వెల్లడించారు. సొసైటీలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని వారు విజ్ఞప్తి చేశారు.
తీర్మానం మేరకే భర్తీ..
మేర్గు రాజేశ్, సొసైటీ చైర్మన్
పాలక వర్గ తీర్మానం మేరకు ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేశామని చైర్మన్ రాజేశ్ తెలిపారు. పారదర్శకంగా నియామకాలు చేపట్టినట్లు చెప్పారు. కొంతమంది డైరెక్టర్లు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment