![కారు నడిపేదెవరో?](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/trs_mr-1738870531-0.jpg.webp?itok=IIKhKIWu)
కారు నడిపేదెవరో?
సాక్షి, వరంగల్: ఓవైపు బీఆర్‌ఎస్ అధినాయకత్వం పార్టీని మరింత బలోపేతం చేయాలని భావిస్తుంటే.. ఇంకోవైపు శ్రేణులను సమాయత్తం చేసే పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఏడాది నుంచి ఖాళీగా ఉండడంతో కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. బీఆర్‌ఎస్ అధ్యక్షుడి ఎంపిక విషయంలో అధిష్టానం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో క్షేత్రస్థాయిలో పరిస్థితులు పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ఉండగా, బీజేపీకి మరోమారు గంటా రవికుమార్‌ను అధ్యక్షుడిగా నియమించారు. మన పార్టీకి అధ్యక్షుడిని ఎప్పుడు నియమిస్తారని గులాబీ కార్యకర్తల్లో ప్రశ్నలు మొదలయ్యాయి. గత బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్.. ఎంపీ ఎన్నికల సమయంలో పార్టీని వీడి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీని పట్టించుకునే నాథుడు లేకపోవడంతో జిల్లాలో విచిత్ర పరిస్థితి నెలకొంది. జిల్లా పరిధిలోకి వచ్చే నర్సంపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, పరకాల నియోజకవర్గం పరిధిలోని గీసుకొండ, సంగెం మండలాల్లో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండలంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పార్టీ పిలుపునిచ్చే ధర్నా, నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో నాయకుడు లేకపోవడంతో అక్కడ పార్టీ బాగా బలహీనపడుతుందన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పార్టీ క్షేత్రస్థాయిలో పటిష్టం కావాలంటే బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడి నియామకం ఆవశ్యకమని, ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఉపయోగపడుతుందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
ఎందుకింత నిర్లక్ష్యం..
జిల్లాలో పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఉన్నారు. ఇంతగా ముఖ్య బలగమున్నా బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్ష పదవికి ఎవరు దొరక్కపోవడం ఏంటని కార్యకర్తల నుంచి ప్రశ్నలు ఎ దురవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌కు రథసారథి లేకపోవడంతో పార్టీకి ఇబ్బందిగా మారిందంటున్నారు. ముఖ్యనేతలూ ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు నియామకం జరపలేదన్న చర్చ నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళనైనా పార్టీ అధ్యక్షుడిని నియమిస్తే మంచి ఫలితాలు వస్తాయని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
ఏడాది సమీపిస్తున్నా ఖాళీగానే బీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్ష పదవి
నడిపించే నాయకుడు లేకపోవడంతో
కార్యకర్తల్లో నైరాశ్యం
స్థానిక ఎన్నికల్లోగా రథసారథిని
నియమించాలంటున్న శ్రేణులు
Comments
Please login to add a commentAdd a comment