భీమవరం (ప్రకాశంచౌక్): ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాముల త్యాగం ఎనలేనిదని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం అమరజీవి జయంతి సందర్భంగా ఆయన చిత్రాపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు విశేష కృషి చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు అన్నారు. యువత ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఇన్‌చార్జి జేసీ ఎం.సూర్యతేజ మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటు గాంధీ మార్గంలో పొట్టి శ్రీరాములు పయనించారన్నారు. ఆయన సేవలను ప్రతిఒక్కరూ స్మరించుకోవాలన్నారు. ఈ సందర్భంగా 133 మంది వసతి గృహ విద్యార్థులకు జియో కిమ్ వారు స్పాన్సర్ చేసిన ఆల్ ఇన్ వన్ గైడ్లను కలెక్టర్ చేతులమీదుగా అందజేశారు. డీఆర్వో కె.కృష్ణవేణి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి గణపతిరావు, ఆర్డీఓ దాసి రాజు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు.
మద్ది ఆదాయం రూ.27.58 లక్షలు
జంగారెడ్డిగూడెం రూరల్: గురవాయిగూడెంలోని మద్ది ఆంజనేయస్వామి దేవస్థానంలో హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. 49 రోజులకు రూ.27,58,946 నగదు లభించినట్టు ఆలయ ఈఓ ఆకుల కొండలరావు తెలిపారు. దేవదాయ శాఖ తనిఖీదారు (తాడేపల్లిగూడెం) ఎ.సుజన్‌కుమార్ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు నిర్వహించామన్నారు.
ఇంటర్ పరీక్షలకు 32,668 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): సీనియర్ ఇంటర్ థియరీ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా 106 కేంద్రాల్లో 33,638 మంది విద్యార్థులకు 32,668 మంది హాజరయ్యారు. ఏలూరు జిల్లాలో 39 కేంద్రాల్లో 10,809 మంది విద్యార్థులకు 10,477 మంది హాజరయ్యారు. 1,615 మంది ఒకేషనల్ విద్యార్థులకు 1,487 మంది హాజరయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాలో 52 కేంద్రాల్లో 14,897 మంది జనరల్ విద్యార్థులకు 14,584 మంది, 1,539 మంది ఒకేషనల్ విద్యార్థులకు 1,436 మంది హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో 15 కేంద్రాల్లో 4,097 మంది జనరల్ విద్యార్థులకు 4,038 మంది, 681 ఒకేషనల్ విద్యార్థులకు 646 మంది హాజరయ్యారు. మొత్తంగా 97 శాతం హాజరు నమోదైంది.
కాపీ కొడుతూ పట్టుబడ్డ చైతన్య విద్యార్థి
కొవ్వూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరిగిన పరీక్షలో కొవ్వూరు చైతన్య కళాశాల విద్యార్థి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతూ పట్టుబడ్డాడు. అతడిని మిగిలిన పరీక్షలు రాయకుండా బోర్డు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటన మినహా పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.చంద్రశేఖరబాబు తెలిపారు.
భవన నిర్మాణాలు వేగిరపర్చాలి
చింతలపూడి: సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల భవనాలను ఆగస్టు నాటికి పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నట్టు ఏపీఈడబ్ల్యూఏఐడీసీ ఎండీ సి.దీవన్‌రెడ్డి అన్నారు. స్థానిక బాలుర గురుకుల పాఠశాల భవనాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదేళ్ల క్రితం మంజూరైన భవనాల నిర్మాణం పలు కారణాలతో నిలిచిపోయిందని, విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా నిర్మాణాన్ని పూర్తిచేయడానికి ఆదేశించామన్నారు. ప్రస్తుతం భవనాల నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయని, భవనాలను పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థులను తరలిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment