తీపర్రులోనూ తప్పని తిప్పలు
సాక్షి, భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లాకు ఇసుక ర్యాంపులు లేకపోవడంతో తూర్పుగోదావరి జిల్లా తీపర్రు ర్యాంపును కేటాయించారు. ఈ ర్యాంపు నుంచి ఇసుక తెప్పించుకోవాలంటే భయపడుతున్నారు. నిర్ణయించిన దానికన్నా రెట్టింపు ధరకు కొనాల్సివస్తుందని నిర్మాణదారులు వాపోతున్నారు. తీపర్రు ర్యాంపు నుంచి ఆకివీడుకు మధ్య దూరం సుమారు 63 కిలోమీటర్లు. ఐదు యూనిట్ల ఇసుకకు ప్రభుత్వం నిర్ణయించిన రూ.1924 లోడింగ్, రూ.10,710 రవాణా చార్జీ కలిపి వినియోగదారుడికి రూ. 12,634కు చేరాలి. ర్యాంపు వద్ద అనధికార వసూళ్లు, సకాలంలో లోడింగ్ చేయక వెయిటింగ్ చార్జీల రూపంలో రూ.28 వేలు వరకు వసూలు చేస్తున్నారు. వినియోగదారుడిపై రూ.15 వేల వరకు అదనపు భారం పడుతోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ఇసుకకు నిర్ణీత వ్యయం కన్నా దాదాపు రెట్టింపు వ్యయం అవుతోంది.
ఇసుకలో సముద్రపు ఉప్పునీటి సాంద్రతతో జిల్లాలోని ఆరు ఓపెన్ రీచ్‌లు, ఐదు డిసిల్టేషన్ పాయింట్లు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలోకి వెళ్లడంతో మూతపడ్డాయి. జిల్లా అవసరాల నిమిత్తం ఇసుక కోసం తూర్పుగోదావరి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల పరిధిలోని పెండ్యాల, పందలపర్రు, గోపాలపురం తదితర ర్యాంపులకు వెళ్లాల్సి వస్తోంది. లోకల్ పేరిట అక్కడి స్థానిక కూటమి నాయకులు ర్యాంపుల వద్ద ఆధిపత్యం చెలాయిస్తున్నారు. లోకల్ వాళ్లకే మొదటి ప్రాధాన్యత అంటూ ఇతర జిల్లాల లారీలు, ట్రాక్టర్ల లోడింగ్ అడ్డుకుని తమ వాహనాల్లో లోడింగ్ చేసుకుంటున్నారు. రెండు మూడు రోజులకు జిల్లాకు చెందిన వాహనాలకు ఒక్క ట్రిప్ లోడుకాని పరిస్థితులు ఉన్నాయి.
తీపర్రుతోనూ తీరని వెతలు
జిల్లా అవసరాల నిమిత్తం కలెక్టర్ సీహెచ్ నాగరాణి ప్రత్యేక చొరవ తీసుకుని తూర్పుగోదావరి జిల్లాలోని తీపర్రు, ఔరంగబాద్‌లోని ర్యాంపులను ప్రభుత్వం నుంచి కేటాయించేలా చేశారు. ఈ నెల 9 నుంచి తీపర్రు ర్యాంపులో లోడింగ్‌లు మొదలయ్యాయి. గత వారం రోజుల వ్యవధిలో కేవలం 210 వరకు లారీలు, ఉచిత ఇసుకకు సంబంధించి 28 ట్రాక్టర్లు మాత్రమే లోడయ్యాయి. ఇసుక లోడింగ్ కోసం రోజుల తరబడి పడిగాపులు పడాల్సి వస్తోందని లారీ డ్రైవర్లు వాపోతున్నారు. ఉచిత ఇసుక కోసం ట్రాక్టర్‌కు రూ.600 వసూలు చేస్తున్నారు. కాకినాడ జిల్లాకు కూడా ప్రభుత్వం ఈ ర్యాంపునే కేటాయించింది. ఒక్క బాటే ఉండగా మూడు జిల్లాల నుంచి వచ్చే వాహనాలతో తరచూ ఇక్కడ ట్రాఫిక్ జామ్ సమస్య నెలకొంటోంది.
రూ. 5 వేల నుంచి రూ. 6 వేల అదనపు వసూళ్లు
టెండర్ ఖరారు చేసిన ధర మేరకు ప్రభుత్వం ర్యాంపుల్లో లోడింగ్ చార్జీలను నిర్ణయించింది. ఐదు యూనిట్ల లారీని నింపేందుకు దాదాపు 20 టన్నుల ఇసుక అవసరమవుతుంది. ఈ మేరకు తీపర్రు ర్యాంపులో టన్ను ఇసుకకు లోడింగ్ ధర రూ.96.02 కాగా, పెండ్యాలలో రూ.69, పందలపర్రు రూ.104.42, ఔరంగబాద్ (డీసిల్టేషన్ ర్యాంపు) రూ.229గా నిర్ణయించారు. ఈ లోడింగ్ చార్జీలతో పాటు లారీకి అదనంగా రూ. 5 వేల నుంచి రూ.6 వేల వరకు వసూలు చేస్తున్నట్టు లారీ యూనియన్ నాయకులు చెబుతున్నారు. ఈ సొమ్ములు అధికార పార్టీ నేతల జేబులోకి వెళ్తున్నాయనే ప్రచారం ఉంది. అధికారులకు ఫిర్యాదు చేస్తే కొన్ని ట్రిప్పులు నిర్ణీత ధరకు వేస్తున్నారని, తర్వాత షరామామూలేనని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లారీ అసోసియేషన్ అధ్యక్షుడు రావూరి రాజా చెప్పారు. ఔరంగాబాద్ ర్యాంపులో నిర్ణీత ధర కన్నా లారీకి రూ. ఏడు వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నట్టు చెబుతున్నారు.
రెట్టింపు రవాణ చార్జీలు
40 కిలోమీటర్లు లోపు దూరానికి టన్నుకు రూ.9 చొప్పున ఐదు యూనిట్ల లారీకి కిలోమీటరుకు రూ.180, 40 కిలోమీటర్లు దాటితే రూ. 8.5 చొప్పున రూ. 170గా ప్రభుత్వం నిర్ణయించింది. లోడింగ్ పాయింట్ వద్ద రెండు రోజుల వరకు లోడింగ్ కాని పరిస్థితి. దీంతో డ్రైవర్, క్లీనర్ జీతాలు, మెయింటినెన్స్ రూపంలో రోజుకు రూ. 2 వేల నుంచి రూ.2,500 వరకు వెయింటింగ్ చార్జీలు వేస్తున్నారు.
తీపర్రు నుంచి దూరం, ధరలు
నియోజకవర్గ కేంద్రం దూరం (కి.మీ) 5 యూనిట్ల లారీకి ప్రస్తుత ధర సుమారుగా
భీమవరం 54 రూ. 11,104 రూ. 24,000
నరసాపురం 44 రూ. 9,404 రూ. 20,000
పాలకొల్లు 35 రూ. 8,224 రూ. 19,000
ఉండి 58 రూ. 11,784 రూ.26,000
ఆచంట 29 రూ. 7,144 రూ. 16,000
తణుకు 13 రూ. 4,264 రూ. 14,000
తాడేపల్లిగూడెం 34 రూ. 8,044 రూ. 21,000
జిల్లాలో మూతపడిన ఇసుక ర్యాంపులు
జిల్లా అవసరాల కోసం తూర్పుగోదావరి జిల్లా తీపర్రు ర్యాంపు కేటాయింపు
లారీకి రూ. 5 వేల నుంచి రూ. 6 వేల వరకు అదనపు వసూళ్లు
వినియోగదారులపై వెయిటింగ్ చార్జీల భారం
నిర్ణయించిన దానికన్నా రెట్టింపు ధరతో నష్టపోతున్న ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment