ప్రజా సమస్యలపై సీపీఎం ధర్నా
భీమవరం: నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, మహిళలపై దాడులు అరికట్టాలని, విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించరాదని, ట్రూ అప్ చార్జీలు వసూలు నిలిపివేయాలని తదితర ప్రజా సమస్యలతో శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో భీమవరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి బి బలరామ్ మాట్లాడుతూ వంటనూనె, గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పి స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ట్రూఅప్ చార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జేవీవీ గోపాల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇప్పటికీ ఉచిత ఇసుక విధానం అమలు చేయకపోవడం దారుణమన్నారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు డి కళ్యాణి, పట్టణ కార్యదర్శి బి వాసుదేవరావు, జిల్లా కమిటీ సభ్యుడు కె రాజారామ్మోహన్‌న్‌రాయ్ మాట్లాడుతూ టిడ్కో ఇల్లు ఇప్పటికీ లబ్ధిదారులకు పూర్తిగా ఇవ్వలేదని, పట్టణంలో డంపింగ్ యార్డుకు స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. శివారు ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్ సమస్యను పరిష్కరించాలన్నారు. కార్మికులకు, స్కీమ్ వర్కర్లకు సమాన వేతనం ఇవ్వాలన్నారు. ధర్నాలో జుత్తిగ నర్సింహమూర్తి, కె.క్రాంతిబాబు, బాతిరెడ్డి జార్జి, మామిడిశెట్టి రామాంజనేయులు, ఎం.వైకుంఠరావు, కె.తవిటినాయుడు, దనికొండ శ్రీను, గొర్ల రామకృష్ణ, ఎస్‌కే వలి, ఇంజేటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment