ఇరిగేషన్ పనులపై దృష్టి సారించాలి
భీమవరం: రానున్న దాళ్వాలో సాగునీటి ఎద్దడి లేకుండా ఇరిగేషన్ పనులపై దృష్టి సారించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన నీటిపారుదల సలహామండలి సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 20 మండలాల్లోని 9 ప్రధాన కాలువల ద్వారా సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి సరఫరా జరుగుతుందన్నారు. రబీ పంటకు సాగునీరు కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుని పక్కాగా అమలు చేయాలన్నారు. డిసెంబర్ 31వ తేదీలోగా జిల్లాలో అన్ని చేపలు, రొయ్యలు చెరువులు, ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకులు, పశువులు, రజకుల చెరువులు పూర్తిస్థాయిలో నింపుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.
అడ్డుకట్టల ద్వారా అధిగమించాలి
దాళ్వా పంటకు కొంతమేరకు నీటిలభ్యత తక్కువగా ఉన్నందున నీటిని పొదుపుగా వాడుకుంటూ డ్రెయిన్లపై అడ్డుకట్టలు వేయడం, ఆయిల్ ఇంజిన్లు ఏర్పాటు, వంతులవారీ విధానం అమలు ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా చూడాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. కాలువలు మూసివేసే సమయంలో చేపట్టాల్సిన మరమ్మతు పనులపై పూర్తిస్థాయి నివేదికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్‌రెడ్డి, డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, భీమవరం నరసాపురం, తాడేపల్లిగూడెం ఆర్డీవోలు కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, దాసి రాజు, ఖతీబ్ కౌసర్ భానో, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి పి నాగార్జునరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, విద్యుత్ ఎస్‌ఈ ఎ.రఘునాథ బాబు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి బీవీవీ నాగేశ్వరరావు, జిల్లా డ్రెయినేజీ అధికారి పి.సుబ్రహ్మణ్యేశ్వరరావు, మత్స్య శాఖ అధికారి కే వివేక్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు కలెక్టర్ నాగరాణి ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment