విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ఆకివీడు: విద్యుదాఘాతానికి గురై ఒక వ్యక్తి మృతి చెందాడు. ఆకివీడు మండలంలోని కుప్పనపూడి శివారు శివపార్వతీపురంలోని రొయ్యల చెరువు గట్టు వద్ద గడ్డి కోస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ వైర్ తగిలి మాధుం వెంకటేశ్వరరావు(45) మృతి చెందినట్లు ఎస్సై హనుమంతు నాగరాజు మంగళవారం చెప్పారు. మృతుడి భార్య నాగ ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
విలేకరిపై దాడి
కొయ్యలగూడెం: ఓ విలేకరిపై సోమవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దీనిపై బాధిత విలేకరి మన్నే దుర్గబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల కూటమి ప్రభుత్వానికి చెందిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఒక ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి అక్రమాలపై తమ ఛానల్లో ప్రసారం చేశామని తెలిపాడు. దీంతో సదరు ఎమ్మెల్యే తనపై కక్షగట్టి దాడి చేయించారని ఆరోపించాడు. ఈనెల 2వ తేదీ రాత్రి గోపాలపురం నుంచి కొయ్యలగూడెంకి బైక్‌పై వస్తుండగా పొగాకు వేలం కేంద్రం ఎదుట ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు తన మొహంపై కారం జల్లి దాడికి పాల్పడ్డారన్నారు. ఆ సమయంలో తాను కేకలు వేయడంతో అగంతకులు గోపాలపురం వైపు పారిపోయారని పేర్కొన్నాడు. అనంతరం మీడియా మిత్రుల సహాయంతో కొయ్యలగూడెం ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు మంగళవారం కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్‌లో విచారణ చేపట్టారు.
కఠినంగా శిక్షించాలి
ఏలూరు (టూటౌన్): విలేకరిపై దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. జి–తెలుగు న్యూస్ చానల్ విలేకరి గతంలో స్థానిక జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై ‘పవన్ మాటపై పట్టింపు లేని ఎమ్మెల్యే వసూళ్లకు దిగాడు’ అనే వార్తను రాసినందుకు గాను అతడిపై దాడి జరిగినట్లు తెలిసిందన్నారు. ఇది పత్రికా స్వేచ్ఛ గొంతునొక్కే చర్యగానే చూడాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment