మోగల్లులో అపరిచిత మహిళ బురిడీ
పాలకోడేరు: మోగల్లు గ్రామస్తులను ఓ అపరిచిత మహిళ బురిడీ కొట్టించి డబ్బులతో ఉడాయించిన ఘటన ఇది. వంద రూపాయలు కట్టండి.. వేల రూపాయల విలువైన టీవీ, ఫ్రీజ్, ఏసీ, డబుల్ కాట్ మంచం లాటరీలో గెలుచుకోండి అంటూ ఓ అపరిచిత మహిళ మోగల్లుకు వచ్చింది. ఇంకేముంది వస్తే వేలు.. పోతే వంద అనుకుని జనం ఎగబడి మరీ కట్టేశారు. తర్వాత మరో అంకానికి తెర తీసింది. మీకు టీవీ తగిలింది.. మీకు ఫ్రిజ్ తగిలింది.. మీకు మంచం తగిలింది.. అవన్నీ మా కంపెనీ నుంచి తీసుకు రావడానికి ఒక్కొక్కరికి మూడు వేలు అవుతుందంటూ ఒకరికి తెలియకుండా ఇంకొకరి నుంచి వసూలు చేసి ఉడాయించింది. ఈ విధంగా మోగల్లు గ్రామంలో 20 మంది వరకూ మోసపోయారు. ఇప్పుడు వారంతా గగ్గోలు పెడుతున్నారు. నాకు లాటరీ తగలిందంటే పింఛన్ డబ్బులు రూ.3 వేలు ఇచ్చి మోసపోయానని కె.దుర్గ లబోదిబోమంటోంది. ఐదు గంటలలోగా వస్తువులు ఇచ్చేస్తానంటే ఆశపడి రూ.3 వేలు కట్టానని మరో బాధితురాలు గోడి శ్రీలక్ష్మి వాపోయింది. బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి సమాయత్తం అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment