అనుమతి లేని విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించడమేంటి?
నూజివీడు: పట్టణంలో రద్దీగా ఉండే బస్టాండు సెంటర్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన గౌతు లచ్చన్న విగ్రహాన్ని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించడం ఏంటి? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మున్సిపాలిటీ అనుమతి గానీ, జిల్లా కలెక్టర్ అనుమతి గానీ ఏమీ తీసుకోకుండా అనధికారికంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై మొదటి నుంచి ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అనుమతి కోసం ఎజెండాలో ఒక అంశంగా పెట్టగా నిబంధనల ప్రకారం ఆర్‌అండ్‌బీ స్థలాల్లో విగ్రహాలను ఏర్పాటు చేయడానికి వీల్లేదని కౌన్సిల్ తిరస్కరించింది. పట్టణంలో ఎన్టీఆర్, వైఎస్సార్, ఎమ్మార్ అప్పారావు విగ్రహాలను ఏర్పాటు చేయడానికి అనుమతి కోసం కౌన్సిల్ సమావేశం ఎజెండాలో అంశాన్ని రెండు నెలల క్రితం పెట్టగా అప్పుడు టౌన్ ప్లానింగ్ అధికారులు అభ్యంతరం చెప్పారు. ఇప్పుడు అధికారులు మాత్రం తమ తప్పు లేదు అని అనిపించుకోవడానికి గౌడ సంఘానికి చెందిన ఒక వ్యక్తి ఇంటి తలుపుకు మాత్రం గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగించాలని శనివారం నోటీసును అంటించారు? విగ్రహ ఏర్పాటు విషయంలో మున్సిపల్ అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment