అరకొర వైద్యంతో అవస్థలు
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా కేంద్రం భీమవరంలోని ప్రభుత్వాసుపత్రిలో అరకొర వైద్య సేవలు అందుతున్నాయి. ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్య నిపుణులు (స్పెషలిస్టులు) అందుబాటులో లేకపోవడంతో వైద్యసేవలు అందక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పేదలకు వైద్యం అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. జిల్లా కేంద్రంలో ఉన్న ఈ ఆసుపత్రికి సాధారణ రోజుల్లో 300 నుంచి 400 మంది, సీజనల్ కాలంలో రోజుకు 400 నుంచి 500 మంది ఓపీ రోగులు వస్తుంటారు. అలాగే ఇన్‌పేషెంట్లుగా రోజుకు 20 నుంచి 30 వరకూ ఉంటారు. నెలకు డెలివరీ కేసులు 100 వరకూ ఉంటున్నాయి. జిల్లాలోని నర్సాపురం, పాలకొల్లు, ఉండి, కృష్ణా జిల్లా తీర ప్రాంత ప్రజలు కూడా భీమవరంలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు పొందుతారు. అలాంటి ప్రాధాన్యత కలిగిన ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల కొరత, సౌకర్యాల కొరత వేధిస్తున్నా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్పెషలిస్టుల కొరతతో ఇబ్బందులు
భీమవరం ప్రభుత్వాసుపత్రిలో స్పెషలిస్టు వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. ఈ ఆసుపత్రికి సంబంధించి సీఎస్‌ఆర్‌ఎం, సివిల్ సర్జన్, జనరల్ సర్జన్, సివిల్ సర్జన్ జనరల్ మెడిసిన్, డెర్మటాలజిస్ట్ తదితర స్పెషలిస్ట్ వైద్యులు లేరు. అలాగే సుమారు 10 మంది వరకూ వైద్య సిబ్బంది కోరత కూడా ఉంది. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆయా వ్యాధులకు సంబంధించి వైద్యం అందడం లేదు. చేసేది లేక వారు పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేసి వైద్యం పొందాల్సిన పరిస్థితి.
స్కానింగ్ సేవలు నిల్
భీమవరం ప్రభుత్వాసుపత్రిలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్‌కు రేడియాలజిస్ట్ (డాక్టర్) లేకపోవడంతో స్కానింగ్ సేవలు నిలిచిపోయాయి. గత ఆరు నెలలుగా ఆసుపత్రిలో స్కానింగ్ సెంటర్ నిరుపయోగంగా ఉంది. ఆసుపత్రికి వచ్చే గర్భిణులు, ఇతర వ్యాధులకు సంబంధించి వైద్యులు స్కానింగ్‌కు సిఫార్సు చేస్తే పట్టణంలోని ప్రైవేట్ ల్యాబ్‌ల్లో వేల రూపాయాలు ఖర్చు చేసి స్కానింగ్ చేసుకోవాల్సి వస్తుంది. దీంతో పేద, మధ్యతరగతి వారికి స్కానింగ్ ఖర్చు చాలా భారంగా ఉంది.
పూర్తిస్థాయిలో సదరం క్యాంపులు లేవు
ఈ ప్రభుత్వాసుపత్రిలో పూర్తిస్థాయిలో సదరం క్యాంపుల సౌకర్యం లేదు. ఇక్కడ కేవలం ఎముకలకు మాత్రమే సంబంధించి సదరం క్యాంపు నిర్వహిస్తున్నారు. కంటి, చెవి, ఇతర వ్యాధులకు సంబంధించి సదరం క్యాంపులు భీమవరం ఆసుపత్రిలో అందుబాటులో లేవు. దీంతో జిల్లా ఆసుపత్రి తణుకు, రాజమండ్రి ప్రభుత్వాసుపత్రులకు భీమవరం, నర్సాపురం, పాలకొల్లు, ఉండి నియోజవకర్గ ప్రాంత ప్రజలు వెళ్తున్నారు. దాదాపు 30 నుంచి 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సదరం క్యాంపులకు చేరుకోవడంలో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి భీమవరం ప్రభుత్వాసుపత్రిలో పూర్తిస్థాయిలో వైద్యులను నియమిస్తే ప్రజలకు అటు పూర్తిస్థాయిలో వైద్య సేవలు, ఇటు అన్ని రకాల సదరం క్యాంపులు స్థానికంగానే లభించే అవకాశం ఉంటుంది.
వేధిస్తున్న వైద్యుల కొరత
స్కానింగ్ సేవలు నిల్
పూర్తిస్థాయిలో లేని సదరం క్యాంపులు
ఇదీ భీమవరం ప్రభుత్వాసుపత్రి దుస్థితి
Comments
Please login to add a commentAdd a comment