సంక్షేమ సారథీ.. వర్ధిల్లు వెయ్యేళ్లు
జనాభిమానం ఉప్పొంగింది. సేవా సంబరం అంబరాన్నంటింది.. అభివృద్ధి వారధి.. సంక్షేమ సారథికి ఊరూవాడా నీరా‘జనాలు’ అర్పించారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు,పార్టీ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
జననేతకు నీరా‘జనం’
● పండుగలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
● సేవా కార్యక్రమాలతో అభిమానం చాటిన పార్టీ శ్రేణులు
● ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పలుచోట్ల రక్తదాన శిబిరాలు
● పేదలకు దుప్పట్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు
సాక్షి, భీమవరం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు జిల్లావ్యాప్తంగా పండుగలా జరిగాయి. పార్టీ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లు వద్ద కేక్‌లు కట్‌చేసి స్వీట్లు పంచారు. పేదలకు దుప్పట్లు, దు స్తులు, ఆస్పత్రుల్లోని రోగులకు పండ్లు, బ్రెడ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల పలువురు నాయకులు మాట్లాడుతూ జగన్ పాలన స్వర్ణయుగాన్ని తలపించిందన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, పేద ప్రజల అభ్యున్నతికి అమలుచేసిన సంక్షేమ పథకాల దేశంలోని ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. ఆరునెలలకే కూటమి ప్రభుత్వంపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందన్నారు. సూపర్ సిక్స్ అంటూ గద్దెనెక్కాక ఒక్క పథకం అమలుచేయకుండా సూపర్‌గా మోసం చేసిన తీరుపై ఎక్కడికక్కడ జనం మండిపడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో చేకూరిన సంక్షేమ లబ్ధిని ప్రజలు గుర్తు చేసుకుని మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ.. వెయ్యేళ్లు వర్ధిల్లు.. నూరేళ్లు జీవించు.. అని దీవించారు.
●తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద వేడుకలు ఘనంగా జరిగాయి. మెగా రక్తదాన శిబిరం నిర్వహించగా అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. ఆస్పత్రిలో రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. రాష్ట్ర రైతు వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురాం ఆధ్వర్యంలో శుక్రవారం అర్ధరాత్రి కేక్ కట్ చేసి, బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. పెంటపాడులో మహిళలు, వృద్ధులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు.
●భీమవరం ప్రభుత్వాస్పత్రి ఆవరణలో పార్టీ నేతలు కేక్ కట్‌చేసి వేడుకలు నిర్వహించారు. రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి, పార్టీ పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు తదితరులు పాల్గొన్నారు. పార్టీ నేత రాయప్రోలు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో పేదలకు చీరల పంపిణీ చేశారు. వీరవాసరం మండలం నవుడూరులో ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పీహెచ్‌సీలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. వీరవాసరంలో చెల్లెం ఆనందప్రకాష్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. భీమవరం మండలం పెదగరువులో ఎంపీపీ పేరిచర్ల నర్సింహరాజు ఆధ్వర్యంలో వంద మందికి పైగా మహిళలకు చీరల పంపిణీ చేశారు. నరసాపురం పార్లమెంట్ ఇన్‌చార్జి గూడూరి ఉమాబాల, మేడిది జాన్సన్, చినమిల్లి వెంకట్రాయుడు తదితరులు పాల్గొన్నారు.
●కాళ్ల మండలం పెద అమిరంలోని పార్టీ కార్యాలయం వద్ద ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్ నర్సింహరాజు ఆధ్వర్యంలో కేక కట్ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఆకివీడులోని వైఎస్సార్ సెంటర్, కుప్పనపూడి, సిద్ధాపురం గ్రామాల్లో మండలాధ్యక్షుడు నంద్యాల సీతారామయ్య ఆధ్వర్యంలో వేడుకలను జరిగాయి. వైఎస్సార్ సెంటర్‌లో వంద మంది పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు.
●పాలకొల్లులోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త గుడాల శ్రీహరి గోపాలరావు ( గోపి) కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్లు పంపిణీ చేశారు. విశ్వమానవ వేదిక, రాహుల్ వృద్ధాశ్రమాల్లో వృద్ధులకు పండ్లు, చీరలు, దుప్పట్లు అందజేశారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ, పార్టీ నేత గుణ్ణం నాగబాబు తదితరులు పాల్గొన్నారు.
●నరసాపురంలోని పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బర్రే శ్రీవెంకటరమణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. పార్టీ మండల యూత్ విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పీడీ రాజు, ఎంబీసీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న పాల్గొన్నారు.
●తణుకు పట్టణం, తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాల్లో వేడుకలు జరిగాయి. పార్టీ పట్టణ అధ్యక్షుడు మంగెన సూర్య ఆధ్వర్యంలో పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
●ఆచంటలో పార్టీ నాయకుడు సుంకర సీతారామ్ ఆధ్వర్యంలో పీహెచ్‌సీలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పెనుగొండ, ఆచంట, పోడూరు మండలాల్లోని గ్రామాల్లో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment