ఉండి: ఉండి మండలం యండగండి పార్శిల్ శవం కేసు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ ఘటనపై ఐజీ ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ నెల 20న ముదునూరి రంగరాజు ఇంటికి పార్శిల్‌లో శవం రావడంతో అంతా ఉలిక్కిపడ్డారు. అప్పటి నుంచి పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేసినా ఇంకా కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు. ముదునూరి రంగరాజు భార్య, కుమార్తెలను దర్యాప్తులో భాగంగా ప్రశ్నిస్తున్నారు. చిన్న కుమార్తె అత్తింటివారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధాన అనుమానితుడిగా ఉన్న చిన్నల్లుడి ఆచూకీ కోసం నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తును పోలీస్ ఐజీ అశోక్‌కుమార్ పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా ఆదివారం ఏలూరు నుంచి యండగండి మీదుగా భీమవరం చేరుకుని కేసు పురోగతిపై ఆరా తీసినట్లు తెలుస్తుంది. కారులో యండగండి మీదుగా వెళ్తూ గ్రామ పరిధిలో మెయిన్‌రోడ్డుపై ఉన్న సీసీ కెమెరాలను కారులో నుంచే పరిశీలించినట్లు తెలిసింది. ఘటనా స్థలికి చేరుకుంటారని మొదట భావించినా యండగండిలో ఐజీ ఆగకుండా భీమవరం వెళ్లి పోలీసులను ఈ కేసుపై ఆరా తీసినట్లు సమాచారం. ఐజీ రంగంలోకి దిగడంతో పోలీసులు మరింత అప్రమత్తమై అనుమానితుడి ఆచూకీ కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు. అనుమానితుడు దొరికొతేనే గాని పార్శిల్‌లో వచ్చిన శవం ఎవరిది ,మృతుడు ఏ ప్రాంతానికి చెందిన వాడు? అనే వివరాలు తెలియవు. ఇప్పటికే పోలీసుల అదుపులో కొందరు అనుమానితులు ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే పోలీసులు ప్రెస్‌మీట్ పెట్టి కేసుకు సంబంధించిన కీలక వివరాలు చెబుతారని సమాచారం.
ఆచూకీ తెలిస్తే సమాచారం అందించండి
భీమవరం (ప్రకాశంచౌక్) : మృతదేహం ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమచారం అందించాలని పోలీసులు ఒక ప్రకటనలో కోరారు. మృతుడి వయసు సుమారు 30 నుంచి 40 ఏళ్లు ఉంటుంది. ఎత్తు 5.8 అడుగులు. మృతుడి ఒంటిపై పొడుగు చేతుల నలుపు రంగు స్వెటర్, ఆకుపచ్చ రంగు టీ షర్ట్, నలుపు రంగు కట్ చేసిన పాంటు ఉంది. ఈ నెల 16, 17 తేదీల్లో చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ నెలలో ఎవరైనా 30–40 ఏళ్ల వయసున్న వారు అదృశ్యమైతే వారి వివరాలు 9154966497, 9440796648, 9154966508 నెంబర్లకు అందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment