సంక్షేమం తలుపు తట్టేనా ?
● కొత్త ఏడాదిలోనైనా కూటమి తీరు మారేనా ?
సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టారు.. ఏటా రూ.20 వేలు చొప్పున ఇచ్చి అన్నదాతలను ఆదుకుంటామని నమ్మబలికారు.. తల్లికి వందనంగా ఇంట్లో ఉన్న విద్యార్థులందరికీ ఏటా రూ.15 వేలు చొప్పున ఇస్తామని ఇంటింటా చాటారు.. ఆడబిడ్డ నిధిగా ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని భరోసా ఇచ్చారు.. నిరుద్యోగులకు భృతిగా నెలకు రూ.3000 అందిస్తామని హామీ ఇచ్చారు.. ఇవన్నీ జూన్ నుంచే అమలుచేస్తామంటూ బాండ్ పేపర్లు సైతం ఇచ్చిన కూటమి గత ఆరున్నర నెలల పాలనలో చేసింది శూన్యమే. ఏడాదికి మూడని చెప్పి ఈ ఆర్థిక సంవత్సరానికి ఒక్క సిలిండర్‌తో సరిపెట్టారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు పథకాల ఊసే లేదు. సంక్షేమం జాడలేక జనం అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ ఏడాదైనా ఎన్నికల వాగ్దానాలు నిలుపుకునే దిశగా కూటమి సర్కారు పాలన సాగిస్తుందా? లేక షరా మామూలుగానే మాటలతో మభ్య పెడుతుందా అనే సందేహాలతో జిల్లా ప్రజలు కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు.
సాక్షి, భీమవరం: కొత్త ఏడాదికి కోటి ఆశలతో జిల్లా ప్రజలు స్వాగతం పలికారు. తమ ఇంట అన్నీ శుభాలే కలగాలని ఆకాంక్షిస్తూ కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కర్షక శ్రమ సౌందర్యంతో పచ్చని తివాచీని తలపిస్తున్న పల్లెలు.. ఇంటి ముంగిళ్లకు శోభను తెస్తూ అతివల ముగ్గులు.. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కుర్రకారు కేరింతల నడుమ 2024 స్మృతులను గుండెల్లో పదిల పర్చుకుని కోటి ఆశలతో 2025 వసంతానికి తలుపు తెరిచారు. గత ఏడాది చివరిలో కురిసిన వర్షాలతో నష్టపోయిన రైతులు ఈ ఏడాదిలోనైనా మట్టే బంగారమై తమ ఇంట సిరుల పంట పండాలని సాగుకు సాయంగా ప్రభుత్వ భరోసా దక్కాలని కోరుకుంటున్నారు. కూటమి ఆరున్నర నెలల పాలనలో జాడలేకుండా పోయిన సంక్షేమ పథకాలు ఈ ఏడాదైనా తమ ఇంటి తలుపు తట్టాలని పేదలు విన్నవిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తానని హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల కోసం వేయికళ్లతో ఎదురుచూసిన ప్రజలకు 2024 సంవత్సరంలో తీవ్ర నిరాశే ఎదురైంది. కొత్త సంవత్సరంలోనైనా తమ పిల్లల చదువుల నిమిత్తం సర్కారు ‘వందనం’ కోసం తల్లులు.. నెలనెలా ఇస్తామన్న ఆడబిడ్డ నిధి చేతికందాలని, ఉచిత బస్సు ప్రయాణం చేయాలని మహిళలు.. ఉద్యోగాలు వరించాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిరుద్యోగులు.. ఇసుక ఇబ్బంది లేకుండా చేతినిండా పని దొరకాలని భవన నిర్మాణ కార్మికులు ఆశలు పెట్టుకున్నారు.
చల్లారని ధరల మంట...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంటింట్లో రేగిన ధరల మంట ఇంకా చల్లారలేదు. పప్పులు నిప్పులా మండితే.. నూనెల సలసల కాగుతున్నాయి. ఉల్లి ఘాటెక్కింది. ఇతర నిత్యావసరాలు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో పేద వర్గాలకు పూట గడవడం గగనమైపోయింది. అయినా కూటమి సర్కారు ధరలు తగ్గించేందుకు ఏమాత్రం శ్రద్ధ పెట్టకపోవడం గమనార్హం. కొత్త సంవత్సరంలోనైనా నిత్యావసరాల ధరలు తగ్గాలని పేద, సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు.
ఉద్యోగం, ఉపాధికి పట్టం కట్టాలని...
ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలిని పరిస్థితుల్లో గడిపిన ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగ భరోసా దక్కాలని ఆశిస్తున్నారు. కనీస వేతనం కోసం ఉద్యమిస్తున్న కాంట్రాక్టు కార్మికులు, సర్కారు కరుణించి తమ సొంతింటి కల పూర్తి కావాలని పేద వర్గాలు ఆశిస్తున్నాయి. కొత్త ఏడాదిలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని విద్యార్థి, ఉద్యోగ వర్గాలు, రాజకీయాల్లో రాణించాలని నేతలు, తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ శ్రామిక వర్గాలు ఆశల పల్లకీలో కొత్త ఏడాదిని స్వాగతించారు.
రైతుల ఆశలు నెరవేర్చాలి
అప్పులు చేసి సార్వా సాగు చేశాం. ఈ ఏడాది నష్టాలు చవి చూశాం. నూతన ఏడాదిలో రైతుల ఆశలు నెరవేరాలని కోరుకుంటున్నాను. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, రైతు భరోసా, విత్తనాలు, ఎరువులు తదితర రాయితీలు ఇస్తేనే వ్యవసాయం చేయగలం.
– టి.యోహాన్, కౌలు రైతు, తాడేపల్లిగూడెం
అమ్మఒడి ఇస్తారో.. లేదో?
నాకు ఇద్దరు మనవరాళ్లు. ఇద్దరికీ అమ్మ ఒడి అందిస్తానని చంద్రబాబు చెప్పినా నేటికీ ఇవ్వలేదు. ఒక్కొక్కరికి రూ.20 వేలు ఇస్తానని చెప్పడంతో ఎంతో ఆనందించాం. చేయూత పథకం కూడా అందలేదు.
– మంద వెంకటలక్ష్మి, సిద్దాపురం
అడుగడుగునా వంచన
ఇప్పటివరకు కూటమి సర్కారు తీరిదే
సూపర్ సిక్స్ పథకాలతో మభ్యపెట్టి అధికారంలోకి
తల్లికి వందనం, రైతు భరోసాకు ఎగనామం
ఆడబిడ్డ నిధి,
ఉచిత బస్సుకు మంగళం
నిరుద్యోగ భృతి ఊసే లేదు
కొత్త ఏడాదిలోనైనా సంక్షేమం తలుపు తట్టాలని కోటి ఆశలతో జనం
తల్లికి వందనం
ఆడబిడ్డ నిధి
ఉచిత బస్సు ప్రయాణం
నిరుద్యోగ భృతి
అన్నదాత సుఖీభవ
ఎంత నష్టపోయారంటే...
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకాకపోవడంతో ఇప్పటివరకు జిల్లాలో అర్హత కలిగిన ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అడబిడ్డ నిధి పథకానికి జిల్లాలో అర్హత కలిగిన మహిళలు సుమారు 5,96,313 మంది ఉండగా నెలకు రూ.1500 చొప్పున ఈ ఆరు నెలలకు రూ.536.68 కోట్లు అందాల్సి ఉంది. ఆ సొమ్మును వారంతా నష్టపోయారు. తల్లికి వందనం పథకానికి దాదాపు 1,74,763 మంది అర్హులైన విద్యార్థులుండగా, ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున రూ.262.14 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకానికి సుమారు 1,24,645 మంది రైతులు అర్హులు కాగా రూ.249.29 కోట్లు అందాల్సి ఉంది. జిల్లాలో 5.17 లక్షల కుటుంబాలకు గాను 50 శాతం మందికి పైగా చదువుకు తగిన ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నారు. తొమ్మిది లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన మార్చి 16వ తేదీ నుంచి సంక్షేమం జాడ లేక జనం అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ ఏడాదైనా ఎన్నికల వాగ్దానాలు నిలుపుకునే దిశగా కూటమి సర్కారు పాలన సాగిస్తుందా? లేక షరా మాములుగానే మాటలతో మభ్య పెడుతుందా అనేది వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment