బకాయి జీతాలు చెల్లించాలి
ఏలూరు (టూటౌన్): ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) అనుబంధం జిల్లా కమిటీ సమావేశాన్ని స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నాగమణి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పౌష్టికాహార లోపం అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా, కార్మికులకు వేతనాలు పెంచకుండా వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనవరి నుంచి కొత్త మెనూ అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోందని, అయితే ఇప్పటికే ఐదు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, గ్యాస్ ప్రభుత్వమే ఇవ్వాలని, గుర్తింపు కార్డులు జారీ చేయాలని, ప్రతినెలా 5వ తేదీలోపు వేతనాల బిల్లులు ఖాతాల్లో జమచేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇంటర్ విద్యార్థుల మెనూ చార్జీ రూ.60 ఇవ్వాలని కోరారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మధ్యాహ్న భోజన కార్మికులపై వేధింపులు పెరిగాయన్నారు. కార్మికులకు రూ.10 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment