ప్రజాపోరుపై దమనకాండ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రజారోగ్యంపై చెలగాటమాడే పరిశ్రమ వద్దు.. పశువుల వధ తణుకు ప్రాంతానికే అరిష్టం.. రోజూ రక్తం ఎరులైపారి తీవ్ర దుర్గంధం వస్తుంటే ఎలా బతికేదంటూ స్థానికులు గగ్గోలు.. గేదెల వధ పేరుతో గోవులను కూడా వధిస్తున్నారంటూ గో సంరక్షణ సమితి ఆరోపణ.. ఇలా తీవ్ర వివాదంగా మారిన లాహం ఫుడ్ ప్రొడక్ట్స్ పరిశ్రమకు సర్కారు, స్థానిక ప్రజాప్రతినిధి కొమ్ముకాస్తున్నారు.
ఓట్లు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజల అభిమతానికి విరుద్ధంగా అడ్డుగోలుగా పరిశ్రమలు ఏర్పాటుకు సహకరించడంతో పాటు తారాస్థాయిలో జరుగుతున్న ప్రజా ఉద్యమాన్ని పోలీసు, రెవెన్యూ బలగాలతో అణచివేశారు. ప్రజాపోరాటం చేస్తున్న వారిపై సర్కారు దమనకాండకు తెరదీయడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేయడంతో పాటు తణుకు కేంద్రంగా రిలే నిరాహారదీక్షలు నిర్వహించేలా సన్నాహాలు చేస్తున్నారు.
టీడీపీ హయాంలో పరిశ్రమకు అనుమతులు
తణుకు మండలంలోని తేతలి గ్రామంలో లాహం ఫుడ్ ప్రొడెక్ట్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో పశువధ కర్మాగారం ఏర్పాటైంది. 2014లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పరిశ్రమ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోగా వెంటనే అనుమతులు మంజూరు చేశారు. 2016లో నిర్మాణం ప్రారంభం కాగా స్థానికులు అడ్డుకుంటూ వచ్చారు. అనేక వ్యతిరేకతలు, ప్రజా నిరసనల్ని కాదని 2018లో నిర్మాణం పూర్తి చేశారు. ఈ క్రమంలో రోజూ 400 గేదెలను వధించి మాంసాన్ని ఎగుమతి చేసే ప్రాసెసింగ్ యూనిట్‌గా అనుమతులు పొందినట్లు చూపారు. పంచాయితీ నుంచి ప్లాన్ అప్రూవ్‌గాని, ఎన్‌ఓసీ గాని తీసుకోకపోవడంతో స్థానికులు, గోసేవా సమితి హైకోర్టులో కేసు దాఖలు చేయడంతో వ్యవహారం పెండింగ్‌లో పడింది. మళ్ళీ 2022లో ట్రయల్‌రన్ పేరుతో ప్రారంభించడానికి ప్రయత్నించగా అప్పటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి స్థానికులు అడ్డుకోవడంతో నిలిచిపోయింది. దీంతో కోర్టు కేసులు, నిరసనలు, వివాదాలతో పరిశ్రమ పూర్తిగా ప్రారంభం కాకముందే ఆగిపోయింది.
ఉద్యమాన్ని అణచివేసే కుట్ర
ఈ క్రమంలో గత నెల 25 నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నేతృత్వంలో అఖిలపక్షం ఏర్పాటు చేసి పరిశ్రమలను ప్రారంభించడానికి వీల్లేదని ఎంత దూరమైనా పోరాడతామని ప్రకటించారు. 31న చర్చల పేరుతో రిలే నిరాహారదీక్షలను పోలీసులు భగ్నం చేశారు. గోసేవా సమితి సభ్యుడు కొండ్రెడ్డి శ్రీనివాస్‌తో పాటు మరికొందరిని తహసీల్దార్ కార్యాలయంలో చర్చల పేరుతో ఎస్‌ఐ చంద్రశేఖర్ పిలిచి బైండోవర్ చేసి రాత్రి వరకు అక్కడే కూర్చొపెట్టారు. వెంటనే రిలే నిరాహారదీక్ష శిబిరం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందంటూ దీక్షలు భగ్నం చేశారు. అధికార పార్టీ, రెవెన్యూ, పంచాయతీ, పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చి ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతుందని, దీనివెనుక భేరసారాలు కూడా ఉన్నాయని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామ క్రమంలో శుక్రవారం నుంచి రిలే నిరాహారదీక్షలు తణుకు కేంద్రంగా ప్రారంభించాలని నిర్ణయించారు.
పశువధ కర్మాగారంపై తీవ్ర నిరసనలు
తణుకు మండలం తేతలిలో కర్మాగారం ఎదుట దీక్షా శిబిరం
చర్చల పేరుతో పిలిచి అక్రమ బైండోవర్ కేసులు
నిరాహారదీక్ష శిబిరాన్ని భగ్నం చేసిన పోలీసులు
మరోసారి అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలకు సిద్ధం
ప్రభుత్వ మద్దతుతో లాహం ఫుడ్ పరిశ్రమకు అనుమతులు
కూటమి రాకతో మళ్లీ తెరపైకి
కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో పరిశ్రమ నడపడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్ర స్థాయి మొదలుకొని నియోజకవర్గ స్థాయి వరకు ఆర్ధిక వ్యవహారాలతో అందరినీ సర్దుబాటు చేసి ఆగమేఘాల మీద ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా అక్టోబర్‌లో పంచాయతీ నుంచి ఎన్‌ఓసీ ఇవ్వాలని పరిశ్రమ నుంచి లేఖ రావడంతో వ్యవహారం మళ్ళీ వెలుగులోకి వచ్చింది. కోర్టులో కేసు ఉన్న కారణంగా అనుమతులు ఇవ్వడం లేదని పంచాయతీ అధికారులు స్పష్టం చేశారు. ఆ తరువాత నుంచి స్థానికులు పరిశ్రమ వద్ద ఆందోళనలు నిర్వహించడం, నాలుగు లారీల గేదెలను పరిశ్రమలోకి పోకుండా పోలీసులకు అప్పగించడం, ఇతర నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment