కబడ్డీ చాంప్స్ మహారాష్ట్ర, ఢిల్లీ
నరసాపురం: నరసాపురం రుస్తుంబాదలో జరుగుతున్న జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో పురుషుల విభాగంలో మహారాష్ట్ర జట్టు, మహిళల విభాగంలో సీఆర్‌పీఎఫ్ ఢిల్లీ జట్టు చాంపియన్‌షిప్స్ సాధించాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోటీ లు ముగిశాయి. పురుషుల విభాగంలో రన్నరప్‌గా కోల్‌కతా పోలీస్ జట్టు నిలిచింది. 3, 4 స్థానాల్లో సీఆర్‌ఎఫ్ ఢిల్లీ, కోల్‌కతా జట్లు నిలిచాయి. మహిళల విభాగంలో రాజస్థాన్ జట్టు రన్నరప్‌గా నిలిచి రెండో స్థానం దక్కించుకోగా కోల్‌కతా, కేరళ జట్లు 3,4 స్థానాలను దక్కించుకున్నాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ సభలో కలెక్టర్ సీహెచ్ నాగరాణి, జిల్లా ఎస్పీ నయాం అస్మి చేతులమీదుగా విజేతలకు బహుమతులు అందించారు. పురుషుల విభాగంలో మొదటి బహుమతి రూ.1.50 లక్షలు, రెండో బహుమతి రూ.లక్ష, మూడో బహుమతి రూ.75 వేలు, నాల్గో బహుమతి రూ.50 వేలు షీల్డ్స్ అందించారు. మహిళ విభాగంలో విజేతలకూ ఇలానే బహుమతులు అందించారు. మొత్తంగా రూ.7.50 లక్షల నగదు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయాం అస్మి మాట్లాడుతూ గ్రామీణ క్రీడలు సంస్కృతిలో భాగమన్నారు. యువత క్రీడలపై మక్కువ పెంచుకోవాలని సూచించారు. దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పారు. నరసాపురంలో 32 ఏళ్ల నుంచి జాతీయస్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహించడం అభినంధనీయమన్నారు. మాజీ మంత్రి, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, పోటీల కన్వీనర్ కొత్తపల్లి జానకీరామ్, ఆర్డీఓ దాసి రాజు, డీఎస్పీ జి.శ్రీవేద తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన జాతీయస్థాయి కబడ్డీ పోటీలు
Comments
Please login to add a commentAdd a comment