రామగిరి(నల్లగొండ): హత్య కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి రోజారమణి మంగళవారం తీర్పు వెలువరించారు. ప్రొసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం.. కనగల్ మండలం కుమ్మరిగూడేనికి చెందిన మల్లికంటి వెంకటేశం నల్లగొండకు చెందిన ఎస్‌కే గౌస్‌కు రూ.3లక్షలు ఇవ్వాల్సి ఉంది. గౌస్ ఎన్నిసార్లు అడిగినా వెంకటేశం డబ్బులు ఇవ్వడం లేదు. ఇదే విషయమై పలుమార్లు పెద్ద మనుషుల మధ్య పంచాయితీ కూడా జరిగింది. ఈ క్రమంలో 2014 జులై 8న డబ్బులు ఇస్తానని గౌస్‌కు వెంకటేశం చెప్పాడు. ఆ రోజు గౌస్ నల్లగొండకు చెందిన బొండా రవితో కలిసి వెంకటేశం ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో వెంకటేశం, అతడి భార్య శోభ, తండ్రి రాములు, తమ్ముడు యాదగిరి కలిసి గౌస్, రవి కళ్లల్లో కారం చల్లి కత్తులు, గొడ్డలి దాడి చేశారు. దీంతో గౌస్ అక్కడికక్కడే మృతిచెందాడు. రవి అక్కడి నుంచి పారిపోగా.. అతడిని వెంబడించి బలిజగూడెం వద్ద దాడి చేసి చంపారు. రవి అల్లుడు విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ రాములునాయక్, సీఐ సుబ్బిరామిరెడ్డి, ఎస్‌ఐ పరమేష్, కోర్టు కానిస్టేబుల్ పోగుల శేఖర్‌గౌడ్ నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందుతుల్లో ఒకరైన రాములు మృతిచెందాడు. ఈ కేసు తుది తీర్పులో భాగంగా మంగళవారం పబ్లిక్ ప్రొసిక్యూటర్ అఖిల వాదనలతో ఏకీభవించిన నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి రోజారమణి నిందితులకు జీవిత ఖైదు, రూ.6 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
Comments
Please login to add a commentAdd a comment