పత్తి కొనుగోలు చేయాలని రైతుల ధర్నా
ఆత్మకూరు(ఎం): పత్తి కొనుగోలు చేయాలని ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని శ్రీసిద్దేశ్వర కాటన్ మిల్ సమీపంలో ఉన్న రాయిగిరి–మోత్కూరు మెయిన్ రోడ్డుపై మంగళవారం రైతులు ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ.. శ్రీసిద్దేశ్వర కాటన్ మిల్లులో సోమవారం అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోలును తాత్కాలికంగా ఆపివేశారని, సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు తిరిగి కొనుగోలు చేశారని పేర్కొన్నారు. మంగళవారం కూడా పత్తి కొనుగోలు చేస్తారనుకుని పత్తిని తీసుకువచ్చామని తెలిపారు. అయితే సాయంత్రం వరకూ పత్తి కొనుగోలు చేయలేదని పేర్కొన్నారు. రైతులు సుమారు గంట సేపు ధర్నా చేయడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులు, సీసీఐ కేంద్రం నిర్వాహకులతో మాట్లాడారు. పత్తి కొనుగోలు చేస్తామంటూ సీసీఐ కేంద్రం నిర్వాహకులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి వేముల భిక్షం, నాయకులు తు మ్మల సత్యనారాయణరెడ్డి, రైతులు భాషిరెడ్డి, కోల సత్తయ్య, బత్తుల యాదయ్య, గుర్కు నర్సయ్య, బబ్బురి నర్సయ్య, సత్తమ్మ, లింగమ్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment