120 కిలోల డ్రగ్స్ పట్టివేత
భువనగిరి: సీజ్ చేసిన కెమికల్ కంపెనీలో డ్రగ్స్ తయారు చేసి ముంబైకి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. మంగళవారం భువనగిరి డీసీపీ రాజేష్‌చంద్ర తన కార్యాలయంలో విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామానికి చెందిన భానుప్రసాద్, రామాజీపేట గ్రామానికి చెందిన వాసుదేవచారికి రామాజీపేట గ్రామ పరిధిలో శ్రీయాదాద్రి లైఫ్ సైన్సెస్ అనే కెమికల్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మూడుసార్లు అనుమతి రద్దు చేసింది. భానుప్రసాద్ స్నేహితుడైన యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు గ్రామానికి చెందిన నేతి కృష్ణారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అతడికి హైదరాబాద్‌లోని జీడిమెట్లకు చెందిన ఇస్మాయిల్‌తో పరిచయం ఏర్పడింది. ముంబైలో తనకు తెలిసిన వారికి డ్రగ్స్(ఎపిడ్రిన్, మెఫెడ్రోన్) కావాలని, తాను డ్రగ్స్ సరఫరా చేస్తానని, దీని ద్వారా డబ్బులు బాగా సంపాందించవచ్చని ఇస్మాయిల్ కృష్ణారెడ్డితో చెప్పాడు. కృష్ణారెడ్డి తన స్నేహితుడు భానుప్రసాద్‌కి విషయం చెప్పగా.. సీజ్ చేసిన తన కెమికల్ కంపెనీలో డ్రగ్స్ తయారుచేసేందుకు భానుప్రసాద్ ఒప్పుకున్నాడు. భానుప్రసాద్ తన భాగస్వామి అయిన వాసుదేవచారికి డ్రగ్స్ తయారు చేసే విషయం చెప్పడంతో అతడు కూడా అంగీకరించాడు. 10 సంవత్సరాలు కెమికల్ కంపెనీలో పనిచేసిన అనుభవం ఉన్న భానుప్రసాద్, కృష్ణారెడ్డి స్నేహితుడు సత్యనారాయణ కెమికల్ కంపెనీలో సింథటిక్ డ్రగ్స్ తయారీకి అవసరమైన ముడిసరుకును సమకూర్చుకుని డ్రగ్స్ తయారు చేయడం ప్రారంభించాడు. ముంబైకి చెందిన ఫైజాన్ అహ్మద్, ఇఫ్తార్ అహ్మద్ వద్ద పనిచేసే సల్మాన్ షేక్ డోలా హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఉండే ఇస్మాయిల్‌కు 100 కేజీల డ్రగ్స్ కావాలని ఆర్డర్ ఇచ్చాడు.
రెండు కార్లలో డ్రగ్స్ తరలిస్తుండగా..
ఆర్డర్ ఇచ్చిన డ్రగ్స్‌ను సోమవారం ముంబైకి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా.. పక్కా సమాచారం మేరకు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు, రాచకొండ పోలీసుల బీబీనగర్ మండలం గూడూరు టోల్‌ప్లాజా, రైల్వే అండర్‌పాస్ వద్ద రెక్కీ నిర్వహించారు. అదే సమయంలో ముఠా సభ్యులు ఒక కారులో డ్రగ్స్, మరో కారు దానికి ఎస్కార్ట్‌గా వెళ్తుండగా.. రైల్వే అండర్‌పాస్ వద్ద పోలీసులు కార్లను ఆపి 100 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నేతి కృష్ణారెడ్డితో పాటు ముంబైకి చెందిన ఫైజాన్ అహ్మద్, కారు డ్రైవర్ సునీల్‌ను అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు కార్లతో పాటు నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. కెమికల్ కంపెనీ యాజమాని వాసుదేవచారి, భానుప్రసాద్‌తో పాటు ముంబైకి చెందిన సల్మాన్ షేక్ డోలా పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఇస్మాయిల్ వద్ద 5 కేజీల డ్రగ్స్, కెమికల్ కంపెనీలో నిల్వ ఉంచిన మరో 15 కేజీల సింథటిక్స్ డ్రగ్స్, వాటి తయారీకి ఉపయోగించిన యంత్రాలు సీజ్ చేశామని డీసీపీ చెప్పారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.25కోట్లు ఉంటుందని డీసీపీ పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించిన తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఇన్‌స్పెక్టర్ రమేష్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ జయరాజు, నవీన్, కానిస్టేబుళ్లు మధు, ఉదయ్‌ను డీసీపీ అభినందించారు. ఈ సమావేశంలో ఏసీపీలు రవికిరణ్‌రెడ్డి, చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
ఫ యాదగిరిగుట్ట మండలం రామాజీపేట
పరిధిలోని కెమికల్ కంపెనీలో డ్రగ్స్ తయారీ
ఫ కార్లలో ముంబైకి తరలిస్తుండగా గూడూరు
టోల్ ప్లాజా వద్ద పట్టుకున్న పోలీసులు
ఫ ముగ్గురి అరెస్ట్, పరారీలో మరో ముగ్గురు
ఫ పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.25కోట్లు
ఫ వివరాలు వెల్లడించిన డీసీపీ రాజేష్‌చంద్ర
యాదాద్రి లైఫ్ సైన్సెస్ కంపెనీలో సోదాలు
యాదగిరిగుట్ట రూరల్: రామాజీపేట గ్రామ పరిధిలోని యాదాద్రి లైఫ్ సైన్సెస్ కంపెనీలో భవనగిరి డీసీపీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో సోమవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్, ఏసీపీ రమేష్ కుమార్, యాదగిరిగుట్ట ఎస్‌ఐలు, సిబ్బంది కలిసి దాదాపుగా 20 మంది పోలీసులు సోదాలు జరిపారు. ఈ కంపెనీ రామాజీపేట పరిధిలో మొదట ప్రవాహా ల్యాబరేటరీస్ పేరుతో 2006లో ప్రారంభించారు. 2018లో వేరొకరు కంపెనీని తీసుకుని యాదాద్రి లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా పేరు మార్చారు. వెటర్నరీకి సంబంధించిన పలు రకాలైన డ్రగ్స్‌ను ఈ కంపెనీలో తయారు చేసేవారు. ఈ కంపెనీలో గతంలో 50 మంది వరకు పనిచేసేవారు. ప్రస్తుతం 30 మంది మాత్రమే పనిచేస్తున్నట్లు సమాచారం. ఇందులో తయారు చేసే డ్రగ్స్ కోడ్‌ల రూపంలో ఉంటాయని, ఎలాంటి డ్రగ్స్ తయారుచేస్తున్నారో తమకు తెలియదని వర్కర్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment