ఉద్యమ స్ఫూర్తి చాటేలా..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకొని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెద్ద ఎత్తున దీక్షా దివస్ నిర్వహించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో ఈ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించబోతోంది. మూడు జిల్లాల్లో మంగళవారం ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశాలను నిర్వహించింది. ఈ సమావేశాల్లో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పాల్గొని దిశా నిర్దేశం చేశారు. ఈనెల 29వ తేదీన దీక్షా దివస్‌ను విజయవంతం చేసి.. కాంగ్రెస్ ఏడాదిపాలన పూర్తయ్యాక ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యేక కార్యాచరణతో పోరుబాట పట్టేలా బీఆర్‌ఎస్ సిద్ధమవుతోంది.
కేసీఆర్ కృషి యువతకు తెలిసేలా..
నేటి యువతకు నాటి ఉద్యమ తీరును తెలియజేసి వారిలో స్ఫూర్తి నింపేలా దీక్షా దివస్‌ను నిర్వహించాలని ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్ నిర్ణయించింది. నాటి ఉద్యమ తీరు తెన్నులను, కేసీఆర్ కృషిని నేటి యువత కళ్లముందుంచేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. 2009 నవంబర్ 29వ తేదీన కేసీఆర్ దీక్షను చేపట్టి తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని ఎలా మలుపుతిప్పారు.. రాష్ట్ర సాధనకు ఎలాంటి ఎత్తుగడలతో ముందుకు సాగారు.. డిసెంబర్ 9న ప్రకటన వచ్చేలా ఎలా వ్యూహాన్ని అమలు చేశారన్న అంశాలను యువతకు తెలియజెప్పేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి యువత కదిలి వచ్చేలా చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారు.
ప్రత్యేక కార్యక్రమాలు, ఫొటో ప్రదర్శనలు
దీక్ష దివస్ సందర్భంగా మూడు జిల్లా కేంద్రాల్లో, పార్టీ కార్యాలయాల్లో నాటి ఉద్యమానికి కేసీఆర్ ఊపురిలూదిన తీరుపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే కేసీఆర్ చేసిన ఉద్యమం, దీక్ష, తరువాత జరిగిన పరిణామాలు, తెలంగాణ రాష్ట్ర సాధన తీరును వివరించేలా పెద్ద ఎత్తున ఫొటో ప్రదర్శనను నిర్వహించాలని, నాటి ఉద్యమ తీరుతెన్నులు కళ్ల ముందుండేలా ఉద్యమ జ్ఞాపకాలను ఆవిష్కరించేలా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. అలాగే సీఎంగా కేసీఆర్ ప్రజలకు అందించిన పాలన, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను యువతకు వివరించేలా చర్యలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.
29న బీఆర్‌ఎస్ దీక్షా దివస్
ఫ పెద్ద ఎత్తున్న నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయం
ఫ మూడు జిల్లాల్లో విస్తృతస్థాయి సమావేశాలు
ఫ హాజరైన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
ఫ ఏడాదిపాలన తర్వాత ప్రభుత్వంపై పోరుబాటకు కార్యాచరణ
ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతాం
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలపై మాత్రమే ఇప్పుడు మాట్లాడుతున్నాం. ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ పరంగా ఇప్పటివరకు కార్యాచరణ తీసుకోలేదు. కొత్త ప్రభుత్వానికి ఏడాది గడువు ఇవ్వాలన్న విజ్ఞత మాకుంది. కేసీఆర్ అదే చెప్పారు. మాజీ సీఎం కేసఆర్ ప్రభుత్వంపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఏడాది పాలన పూర్తయ్యాక ప్రభుత్వ వైఫల్యాలపై పోరాట కార్యక్రమాలను చేపడతాం.
– మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
మరో ఉద్యమానికి సిద్ధం కావాలి
సాక్షి, యాదాద్రి: తెలంగాణ రాష్ట్ర సాధనకోసం నాడు కేసీఆర్ ప్రాణ త్యాగానికి వెనకాడకుండా చేపట్టిన దీక్షా స్ఫూర్తితో మరో ఉద్యమానికి సిద్ధం కావాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈనెల 29న చేపట్టనున్న దీక్షా దివస్ జిల్లా స్థాయి సన్నాహక సమావేశాన్ని మంగళవారం భువనగిరిలో నిర్వహించారు. ఈసందర్భంగా జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ హయాంలో ప్రగతి పథంలో దూసుకుపోయిందన్నారు. కళ్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. నయవంచక రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, బూడిద భిక్షమయ్యగౌడ్, డాక్టర్ గాదరి కిషోర్‌కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, జెడ్పీ మాజీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, కొలుపుల అమరేందర్, గాదె నరేందర్‌రెడ్డి, ఎనబోయిన ఆంజనేయులు, వస్పరి శంకరయ్య, లింగాల శ్రీకర్‌రెడ్డి, ఏవీ కిరణ్, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, సిద్దుల పద్మ, అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment