కాల్వలకు రూ.210 కోట్లు
పిలాయిపల్లికి రూ.86.22 కోట్లు, ధర్మారెడ్డి కాలువకు రూ.123.98 కోట్లు మంజూరు
సాక్షి, యాదాద్రి : మూసీ కాల్వలకు నిధుల వరద పారింది. పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలకు రూ.210.2 కోట్లు మంజూరయ్యాయి. నిధులు కేటాయించడంతో ఆగిన ఆధునీకరణ పనులు తిరిగి ప్రారంభంకానున్నాయి. మూసీ వృథా జలాలను ఒడిసిపట్టి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆయకట్టు విస్తీర్ణం పెంచాలని, ఇందుకోసం మూసీ ఆధారిత కాలువలను ఆధునీకరించాలని గత ప్రభుత్వ హయాంలో నిర్ణయించారు. ఇందులో భాగంగా కాలువల లోతు, వెడల్పు పెంచడం, స్ట్రక్చర్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కానీ, నిధులలేమి, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అయితే సాగునీటి రంగానికి ప్రాధాన్యమిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మూసీ కాలువల ఆధునీకరణపై దృష్టి సారించింది. డిజైన్లు మార్చి ఆధునీకరణ పనులు పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇప్పటికే బునాదిగాని కాలువకు రూ.267 కోట్లు మంజూరు చేసింది. తాజాగా బుధవారం పిల్లాయపల్లి, ధర్మారెడ్డి కాలువలకు రూ.210.2 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో కాలువల బెడ్ వెడల్పు పెంచడం, గైడ్‌వాల్స్ నిర్మాణం, భూసేకరణ చేయనున్నారు.
ధర్మారెడ్డి కాలువ ఇలా..
ధర్మారెడ్డి కాలువను 66 కి.మీ ఆధునీకరించాల్సి ఉంది. ఇందుకోసం 123.98 కోట్లు మంజూరయ్యాయి. భూదాన్‌పోచంపల్లి మండలం ధర్మారెడ్డిపల్లి నుంచి వలిగొండ మండలం గోకారం చెరువు వరకు 10 మీటర్లు, గోకారం నుంచి శేరినేనిగూడెం వరకు 6 మీటర్లు, శేరినేనిగూడెం నుంచి నార్కట్‌పల్లి మండలం లింగోటం వరకు 3 మీటర్ల మేర కాలువను వెడల్పు చేయనున్నారు. అలాగే శిథిలావస్థకు చేరిన బెడ్‌లను కూలగొట్టి కొత్తవి నిర్మిస్తారు.
పిలాయిపల్లి 66 కి.మీ
పిల్లాయిపల్లి కాలువకు ప్రభుత్వం రూ. 86.22 కోట్లు మంజూరు చేసింది. రంగారెడ్డి జిల్లా బండరావిర్యాల నుంచి యాదాద్రి జిల్లా మీదుగా నల్లగొండ జిల్లా ఉరుమడ్ల వరకు 66 కిలో మీటర్ల మేర కాల్వను ఆధునీకరించనున్నారు. బండరావిర్యాల నుంచి పోచంపల్లి మండలం మైసమ్మ కత్వ వరకు ఏడు మీటర్లు, మైసమ్మ కత్వ నుంచి చిన్నకోడూరు వరకు ఆరు మీటర్లు, చిన్న కోడూరు నుంచి ఉరుమడ్ల దాకా 5 మీటర్ల మేర వెడల్పు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment