ఐదేళ్లుగా అదే కూలి!
ఆత్మకూర్(ఎం) మండలం రహీంఖాన్‌పేటకు చెందిన జోగు శివ 20 ఏళ్లనుంచి మగ్గం నేసేవాడు. ప్రతిఫలం లేకపోవడంతో కార్పెంటర్ పని నేర్చుకున్నాడు. హైదరాబాద్, గుంటూరు, కరీంనగర్‌కు వెళ్లి కార్పెంటర్ పని చేస్తున్నాడు. మగ్గం నేస్తే నెలకు రూ.12వేల ఆదాయం వచ్చేదని, ఇప్పుడు రూ.20 వేల వరకు ఆదాయం వస్తుందని తెలిపాడు. కార్పెంటర్ పని దొరకనప్పుడు మగ్గం నేస్తుంటానని చెప్పాడు.
ఇతని పేరు తాటి కరుణాకర్. ఆత్మకూర్(ఎం మండలం టి.రేపాక. 25 సంవత్సరాల నుంచి పట్టుమగ్గం నేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా కూలి పెంచకపోవడంతో కుటుంబం గడవటం కష్టంగా మారింది. దీంతో రెండేళ్ల క్రితం చేనేత వృత్తి వదిలేశాడు. మోత్కూరులోని ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతని భార్య కూలి పనులకు వెళ్తుంది.. ఇదే తరహాలో మరెందరో కార్మికులు వృత్తిని వదిలి ఇతర పనుల్లోకి వెళ్లిపోయారు.
పొట్ట నింపని పట్టు మగ్గం
చేనేత కార్మికులు తయారుచేస్తున్న పట్టువస్త్రా లు వారి పొట్ట నింపడం లేదు. ఎనిమిది చీరలు నేసినందుకు గాను నెలకు రూ.15వేల నుంచి రూ.18వేల వరకు చెల్లిస్తున్నారు. భార్యభర్తలు ఇద్దరు కష్టపడితేనే నెలకు వచ్చేది రూ.15వేల నుంచి రూ.18వేలు.అంటే ఇద్దరికీ కలిపి రోజుకు రూ.600 మాత్రమే గిట్టుబాటు అవుతుంది. రూ.600లతో కుటుంబం గడిచేది కష్టంగా ఉంటుంది.
ఆత్మకూరు(ఎం): ఉపాధికోసం నేతన్నలు నానా పాట్లు పడుతున్నారు. ఐదు సంవత్సరాల నుంచి చీరలు నేస్తున్నా అదే కూలి ఇస్తుండటంతో గిట్టుబాటు కావడం లేదు. దీనికి తోడు ముడి సరుకుల ధరలు పెరగడం, ప్రింటెడ్ డిజైన్ వస్త్రాలు మార్కెట్‌ను ముంచెత్తడంతో నేతన్నలు పోటీకి నిలువలేకపోతున్నారు. మరోవైపు చేనేత కార్మికుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ ఆగిపోవడంతో బతుకు మరింత దయనీయంగా మారింది. జిల్లాలో 13000 మంది చేనేత కార్మికులు ఉన్నారు. ఇందులో 5,350 మంది జియోట్యాగ్ కలిగి ఉన్నారు.
పథకాలు ఆగిపోవడంతో అవస్థలు
● నూలుపై ఇచ్చే 40శాతం సబ్సిడీ నిలిచిపోయింది. షరతులతో కూడిన పథకం కావడంతో చేనేత కార్మికులందరికీ లబ్ధి చేకూరలేదు.
● త్రిఫ్టు పథకం కొనసాగడం లేదు. ఈ పథకం కింద చేనేత కార్మికుడికి రూ.2000, అనుబంధ కార్మికుడికి రూ.500 చొప్పున తన వాటాధనంగా కార్మికుడి ఖాతాలో జమ అయ్యేవి.
● గతంలో బతుకమ్మ పండుగకు కానుకగా మహిళలకు చీరలు పంపిణీ చేసేవారు. వీటిని తయారు చేసే బాధ్యత పవర్‌లూమ్‌కు అప్పగించడం ద్వారా ఆ వర్గానికి లాభం చేకూరింది. చీరల పంపిణీ నిలిపివేయడంతో కొంత వరకు ఉపాధి కోల్పోయారు.
ఇతర పనుల్లోకి నేతన్న
నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశనంటుతున్నా చేనేత కార్మికులకు కూలి రేట్లు పెంచడం లేదు. మగ్గం నేయగా వచ్చే కూలి గిట్టుబాటు కాకపోవడంతో కొందరు కార్మికులు వృత్తిని వదిలేస్తున్నారు. బట్టలు, ఉల్లిగడ్డ, అల్లం, ఎల్లిగడ్డ, అగరువత్తుల అమ్మకాలు, వారాంతపు సంతల్లో కూరగాయల వ్యాపారం, శుభకార్యాలకు వంట చేయడం, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment